
ఆలుగడ్డలతో ఎప్పుడూ కూరలు, ఫ్రైలు మాత్రమే కాకుండా ఈసారి కొత్తగా ఊరగాయను తయారు చేసి చూడండి. ఎక్కువ సమయం తీసుకోకుండా సులభంగా తయారు చేసుకునే ఈ రెసిపీ స్పైసీగా, పుల్లగా, కొద్దిగా తీపి రుచితో అదిరిపోతుంది. మరి ఆలుగడ్డలతో ఈ టేస్టీ ఊరగాయను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
ఆలుగడ్డలు – 2
ఆవాల పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు
కారం – 1½ టేబుల్ స్పూన్లు
మెంతులు – ½ టీస్పూన్
పసుపు – ½ టీస్పూన్
బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
తాలింపు కోసం
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు – ½ టీస్పూన్
ఇంగువ – ⅓ టీస్పూన్
తయారీ విధానం
ముందుగా ఆలుగడ్డలను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో ఆవాల పేస్ట్, నిమ్మరసం, కారం, పసుపు, వేయించి పొడి చేసిన మెంతులు, బెల్లం తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి.
తర్వాత పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాలింపును మసాలా మిశ్రమంలో కలపాలి.
చివరగా ఆలుగడ్డ ముక్కలను మసాలాలో వేసి బాగా కలపాలి. ఆలుగడ్డ ముక్కలకు మసాలా మొత్తం పట్టేలా కలిపితే రుచికరమైన ఆలుగడ్డ ఊరగాయ సిద్ధమవుతుంది.