Mutton: మటన్‌లోని ఈ ముక్కలతో జాగ్రత్త.. తింటే మీ పని అయిపోయినట్లే.. తప్పక తెలుసుకోండి..

ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మందికి మటన్ లేనిదే ముద్ద దిగదు. అయితే మీరు లొట్టలేసుకుంటూ తినే ఆ మటన్ ప్లేట్‌లో ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని ప్రమాదకరమైన భాగాలు కూడా దాగున్నాయని మీకు తెలుసా? మటన్ షాపులో మీరు నిర్లక్ష్యంగా ఉంటే.. మేక లేదా గొర్రె శరీరంలోని కొన్ని భాగాలు నేరుగా కడుపులోకి చేరి ఆసుపత్రి పాలు చేయవచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Mutton: మటన్‌లోని ఈ ముక్కలతో జాగ్రత్త.. తింటే మీ పని అయిపోయినట్లే.. తప్పక తెలుసుకోండి..
7 Parts Of Goat Meat You Should Never Eat

Updated on: Jul 12, 2026 | 7:53 AM

ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఇళ్లలో నాన్‌వెజ్ ఘుమఘుమలాడాల్సిందే. అందులోనూ మటన్ కర్రీ లేదా నోరూరించే మటన్ బిర్యానీ, మటన్ వేపుడు ఉంటే ఆ మజానే వేరు. ముక్క మెత్తగా, జ్యూసీగా ఉంటే ముద్ద దిగడం కూడా కష్టమే. బిర్యానీకైతే మెత్తటి తొడ భాగం, షోల్డర్ పీసులు బాగుంటాయి. అదే పులుసు, సూప్ ఎముకలతో కూడిన మాంసం (బోన్ ఇన్) రుచిని ఇస్తుందని వంట నిపుణులు చెబుతుంటారు. అయితే మటన్ ద్వారా శరీరానికి ఎన్నో పోషకాలు అందినప్పటికీ, గొర్రె లేదా మేక శరీరంలోని అన్ని భాగాలు ఆరోగ్యానికి మంచివి కావు. కొన్ని భాగాలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా కసాయివాళ్లే కొన్ని భాగాలను తొలగిస్తారు. కానీ కొనుగోలు చేసేటప్పుడు మనం కూడా వాటిపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. మటన్ తినేటప్పుడు ఖచ్చితంగా దూరం పెట్టాల్సిన ఆ 7 భాగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

చేదు సంచి

కాలేయం పక్కనే ఉండే ఈ చిన్న సంచిలో అత్యంత చేదైన పిత్త రసం ఉంటుంది. మాంసం కొట్టేటప్పుడు పొరపాటున ఇది పగిలితే, ఆ రసం మాంసానికి అంటుకుని కూర మొత్తం చేదుగా మారిపోతుంది. అంతేకాదు, అది తింటే పొట్ట ఖరాబవుతుంది.

మూత్రాశయం

ఇది మేక లేదా గొర్రె యొక్క మూత్రం నిల్వ ఉండే భాగం. కాబట్టి ఇందులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వ్యర్థాలు పేరుకుపోయి ఉంటాయి. ఈ భాగాన్ని తింటే శరీరంలోకి విషపూరిత క్రిములు చేరే ప్రమాదం ఉంది కాబట్టి దీనిని పూర్తిగా నివారించాలి.

మెడ నరాలు – తెల్లటి తండ్రులు

మేక మెడ భాగంలో రెండు వైపులా భుజాల వరకు సాగే పసుపు లేదా తెల్లటి రంగులో ఉండే గట్టి నరాలు ఉంటాయి. వీటిని మన జీర్ణవ్యవస్థ అంత సులభంగా అరిగించుకోలేదు. ఫలితంగా అజీర్తి, కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.

శోషరస గ్రంథులు

ఇవి మెడ, గొంతు, కొవ్వు భాగాల మధ్య చిన్న గుళికల మాదిరిగా బూడిద లేదా ఎరుపు రంగులో కనిపిస్తాయి. జంతువుల శరీరంలోకి వచ్చే క్రిములను వడకట్టే కేంద్రాలు ఇవే. కాబట్టి వీటిలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే మనకు కూడా ఇన్ఫెక్షన్లు సోకుతాయి.

పొట్ట కొవ్వు

గొర్రె లేదా మేక పేగులు, పొట్ట భాగంలో పేరుకుపోయే గట్టి కొవ్వును తీసుకోకపోవడమే మంచిది. ఇప్పటికే గుండె సమస్యలు, అధిక బరువు, బీపీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఇది రక్తనాళాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను పెంచి, బ్లాక్స్ ఏర్పడేలా చేస్తుంది.

ఊపిరితిత్తులు

జంతువులు పీల్చే గాలిలోని ధూళి, కాలుష్యం, సూక్ష్మక్రిములు వాటి ఊపిరితిత్తులలో పేరుకుపోతాయి. వాటిని సరిగ్గా ఉడికించకుండా తిన్నా లేదా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు తిన్నా శ్వాసకోస సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

పేగులు

బోటీ కూరను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే వీటి లోపల జంతువుల మల విసర్జన వ్యర్థాలు, జీర్ణం కాని ఆహారం ఉంటాయి. కాబట్టి వీటిని వండే ముందు వేడినీళ్లు, పసుపు వేసి నాలుగైదు సార్లు చాలా శుభ్రంగా కడగాలి. సరిగ్గా క్లీన్ చేయకుండా తింటే తీవ్రమైన విరేచనాలు, వాంతులు అవుతాయి. క్లీన్ చేయడం చేతకాని వారు దీని జోలికి వెళ్లకపోవడమే బెటర్.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల లేదా పోషకాహార నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.)

Follow Us