అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

అరటి పండు అత్యధిక శక్తినిచ్చే పండు. పూర్వ కాలంలో శారీరక శ్రమ చేసేవారు పెరుగన్నంతో కలిపి అరటి పండును తినేవారు. ఆధునిక జీవనశైలికి అనుగుణంగా, బరువు పెరగాలనుకునేవారు, శారీరక శ్రమ చేసేవారు, అత్యవసర సమయాల్లో అరటి పండును పెరుగన్నంతో తీసుకోవచ్చు. అయితే, సాధారణంగా పండ్లను విడిగా తీసుకోవడమే ఉత్తమం.

అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..
Banana Curd Rice

Updated on: Apr 12, 2026 | 7:24 PM

అరటి పండు, మన నిత్య జీవితంలో సులువుగా లభించే, అత్యంత చవకైన, అత్యధిక శక్తినిచ్చే పండ్లలో ఒకటి.. దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుది.. అయితే.. అరటి పండును ఎలా, ఎప్పుడు తింటే దాని ప్రయోజనాలు శరీరానికి సక్రమంగా అందుతాయి..? అనే విషయాలపై చాలా మందికి సందేహం కలుగుతుంది.. ముఖ్యంగా, అరటి పండును పెరుగన్నంతో కలిపి తినడం మంచిదేనా..? కాదా..? అనే విషయాన్ని కూడా చాలా మంది అడుగుతుంటారు.. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. అరటిపండు తినే విషయంలో అపోహలు, వాస్తవాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

అరటి పండు – పోషక విలువల గని:

100 గ్రాముల అరటి పండులో సుమారు 116 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇది మామిడి (74 క్యాలరీలు), పనసతొనలు (88 క్యాలరీలు), సపోటా (98 క్యాలరీలు), సీతాఫలం (104 క్యాలరీలు) వంటి ఇతర పండ్లతో పోలిస్తే చాలా ఎక్కువ. దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లలో సుమారు 60 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. బొప్పాయి, కర్బూజా వంటివి 15-30 క్యాలరీలు, నారింజ, బత్తాయి వంటివి 45 క్యాలరీలు అందిస్తాయి. అరటి పండు మృదుత్వం, తేలికైన జీర్ణ శక్తి, ఏడాది పొడవునా లభ్యత, తక్కువ ధర అరటి పండును “చీప్ అండ్ బెస్ట్” పండుగా నిలుపుతాయి.

పెరుగన్నంలో అరటి పండు – పూర్వ కాలపు ఆచరణ:

పూర్వం రోజుల్లో ప్రజలు అధిక శారీరక శ్రమ చేసేవారు. మూడు పూటలా అన్నమే వారి ప్రధాన ఆహారం. వారికి విడిగా పండ్లు తినడానికి సమయం ఉండేది కాదు.. పైగా అప్పట్లో పండ్లు అంత సులువుగా లభించేవి కూడా కావు. ప్రతి ఇంటి పెరటిలో అరటి చెట్లు ఉండటం వల్ల, అరటి పండ్లు పుష్కలంగా ఉండేవి. ఒక గెల పండితే చుట్టుపక్కల వారికి పంచేవారు. భోజనం చేసిన వెంటనే పనిలోకి వెళ్లాల్సిన అవసరం ఉండటంతో, విడిగా తినే “నాలుగో ట్రిప్” వారికి ఉండేది కాదు. కూరలతో అరటి పండు సరిపోదు కాబట్టి, మజ్జిగ అన్నంలో లేదా పెరుగన్నంలో కలిపి తినే అలవాటు ఉండేది. పిల్లలు విడిగా అరటి పండు తిని భోజనం మానకుండా ఉండేందుకు పెద్దలు ఈ అలవాటును ప్రోత్సహించారు. కష్టపడే పిల్లలకు కూడా పోషకాలు అందాలని ఈ పద్ధతిని పాటించేవారు.

ఆధునిక జీవనశైలిలో అరటి పండు వినియోగం:

నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. పిల్లలు కూడా పెద్దగా కష్టపడకుండానే బడికి వెళ్లి వస్తున్నారు. ఈ నేపథ్యంలో, మూడు పూటలా అధిక క్యాలరీలున్న అన్నం, పండ్లను కలిపి తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఈ రోజుల్లో పండ్లు పుష్కలంగా లభిస్తున్నాయి కాబట్టి, వాటిని విడిగా తినకపోవడం నష్టమే.. అందుకే రాత్రిపూట డిన్నర్ లో ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు. అరటి పండును కూడా ఈ ఫ్రూట్ డిన్నర్ లో భాగం చేసుకోవచ్చు. వ్యక్తి అవసరాన్ని బట్టి ఒకటి, రెండు లేదా ఎక్కువ అరటి పండ్లను తీసుకోవచ్చు.

పెరుగన్నంలో అరటి పండును ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదు?

ఎవరు తినవచ్చు:

బరువు పెరగాలనుకునేవారు, అధిక శక్తి అవసరమైనవారు: హార్డ్ వర్కర్స్, ఎక్కువ బరువు పనులు చేసేవారు తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు కావాలనుకుంటే, పెరుగన్నంలో ఒకటి రెండు అరటి పండ్లను కలుపుకోవచ్చు.

అత్యవసర సమయాల్లో: బయటకు వెళ్ళినప్పుడు, ఉప్పు, నూనె లేని ఆహారం దొరకనప్పుడు, హోటళ్ళలో పెరుగన్నంతో పాటు అరటి పండును నంజుకొని తినవచ్చు. అరటి పండ్లను వెంట తీసుకెళ్లడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

ఆరోగ్య సమస్యల నివారణకు: అల్సరేటివ్ కొలైటిస్, లూజ్ మోషన్స్ వంటి సమస్యలతో బాధపడేవారు రెండు మూడు రోజులు కేవలం పెరుగన్నం, అరటి పండు కాంబినేషన్‌ను రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు.

చిన్న పిల్లలు, వృద్ధులు: కారం తినని పిల్లలకు (మిల్లెట్స్ లేదా రవ్వ అన్నంలో కలిపి), దంతాలు లేని వృద్ధులకు అరటి పండును అన్నంలో కలిపి పెట్టడం సులువుగా జీర్ణమయ్యే, పోషక విలువలున్న ఆహారం.

ఎవరు తినకూడదు/జాగ్రత్త పడాలి:

షుగర్ వ్యాధిగ్రస్తులు: వీరు అరటి పండును పూర్తిగా మానెయ్యాలి. ఒకవేళ తినాలనిపిస్తే, చిన్న సైజు అరటి పండును ఒకటి మాత్రమే తక్కువ మోతాదులో తీసుకోవాలి. అధికంగా తినడం ఇబ్బందిని కలిగిస్తుంది.

సాధారణ జీవనశైలి గలవారు: ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వంటివారు పెరుగన్నంలో అరటి పండును రోజూ తినడం వల్ల అధిక క్యాలరీలు చేరి బరువు పెరిగే అవకాశం ఉంది. వీరు పండ్లను విడిగా, ఫ్రూట్ డిన్నర్ లో తీసుకోవడం ఉత్తమం.

ముఖ్య సూచన:

సాధ్యమైనంత వరకు, ఉడికించిన ఆహారాలతో (పెరుగన్నం వంటివి) పండ్లను కలపడం మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. పండ్లు విడిగా తీసుకున్నప్పుడు వాటి పోషకాలు శరీరానికి సంపూర్ణంగా అందుతాయి. ఉడికించిన ఆహారాలు, పండ్లు వేర్వేరుగా జీర్ణమవుతాయి.. వీటిని కలపడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడవచ్చు. అయితే, ఎప్పుడు కుదరనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ కాంబినేషన్‌ను వినియోగించాలి.. ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us