
చికెన్ సుక్కా అంటే కేవలం ఫ్రై మాత్రమే కాదు, ఇది మసాలాల కలయిక. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా, తాజా మసాలాలను నేరుగా వేయించి దంచడం వల్ల దీనికి ఆ అథెంటిక్ రుచి వస్తుంది. వాటర్ దోసె, రైస్ రోటీ లేదా వేడి వేడి అన్నంతో ఈ సుక్కా తింటే ఆ మజానే వేరు. ఒక్కసారి ఈ స్టైల్‌లో చికెన్ వండితే, మీ కుటుంబ సభ్యులు మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగడం ఖాయం. మరి ఆ ఘుమఘుమలాడే మసాలాల తయారీ విధానం చూసేయండి..
కావలసిన పదార్థాలు:
1 కిలో చికెన్
20 ఎండు మిరపకాయలు
ధనియాలు
జీలకర్ర
మెంతులు
లవంగాలు
యాలకులు
కొబ్బరి తురుము (అర కప్పు)
చింతపండు
వెల్లుల్లి
నెయ్యి.
తయారీ విధానం:
మసాలా తయారీ: నెయ్యిలో ఎండు మిరపకాయలు, ధనియాలను సువాసన వచ్చే వరకు వేయించి.. పసుపు, చింతపండుతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
ఉల్లిపాయ, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకులను నెయ్యిలో వేయించి విడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది సుక్కాకు అసలైన రుచిని ఇస్తుంది.
కొబ్బరి తురుమును రంగు మారకుండా బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
కడాయిలో నెయ్యి వేసి ఉల్లిపాయ, టొమాటో వేయించాలి. చికెన్ ముక్కలను వేసి కొద్దిసేపు వేగనిచ్చి, ముందుగా సిద్ధం చేసిన మిరప-ధనియాల పేస్ట్ వేయాలి. తగినంత ఉప్పు, నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి.
ఫైనల్ టచ్: చికెన్ ముప్పావు వంతు ఉడికినప్పుడు రెండవ మసాలా (వెల్లుల్లి మిశ్రమం) కలపాలి. చివరగా నీరంతా ఆవిరైపోయాక, వేయించిన కొబ్బరి తురుము వేసి 5 నిమిషాలు ఉంచి దించేయాలి.
రుచి పెంచే చిట్కాలు:
నూనె కంటే నెయ్యితో వండితేనే మంగళూరు స్టైల్ రుచి వస్తుంది.
కొబ్బరిని మరీ మెత్తగా చేయకుండా, కేవలం వేయించి చివర్లో కలపడం వల్ల ఆ ‘క్రంచీ’ ఫీల్ వస్తుంది.
సుక్కా అంటే పొడి కూర కాబట్టి, నీరు చాలా తక్కువగా వాడాలి.
చిన్న చిట్కా: ఈ చికెన్ సుక్కాను వండిన వెంటనే కాకుండా, ఒక అరగంట ఆగిన తర్వాత తింటే మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టి రుచి రెట్టింపు అవుతుంది.