AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ ఉన్నవాళ్లు మామిడి పండ్లు తినొచ్చా? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదీ.!

వేసవి కాలం రాగానే నోరూరించే మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేస్తాయి. వీటి రంగు, రుచి ఎవరినైనా కట్టిపడేస్తాయి. మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినాలని ఆశపడటం సహజం. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి.

షుగర్ ఉన్నవాళ్లు మామిడి పండ్లు తినొచ్చా? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదీ.!
Eating Mangoes
Ravi Kiran
|

Updated on: May 13, 2026 | 11:15 AM

Share

వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఎండల కంటే ముందుగా మనకి గుర్తొచ్చేవి తీయని మామిడి పండ్లు. పండ్లలో రాజుగా పిలిచే మామిడికాయ అంటే ఇష్టపడని వారుండరు. అయితే, మధుమేహం(షుగర్) ఉన్నవారికి మాత్రం మామిడి పండును చూడగానే ఒక రకమైన భయం, సందిగ్ధం మొదలవుతుంది. “అమ్మో! ఇది తింటే షుగర్ పెరిగిపోతుందేమో” అని మనసు చంపుకుని ఊరుకుంటారు. మరి నిజంగానే షుగర్ ఉన్నవారు మామిడి పండ్లు తినకూడదా? వైద్య నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మామిడి పండు అనగానే అది కేవలం తీపి మాత్రమే కాదు, అందులో విటమిన్-సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. షుగర్ ఉన్నవారు ఏదైనా ఆహారం తీసుకునే ముందు గ్లైసమిక్ ఇండెక్స్(GI) గురించి తెలుసుకోవాలి. ఒక ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత వేగంగా పెంచుతుందో ఇది చెబుతుంది. మామిడి పండు గ్లైసమిక్ ఇండెక్స్ సుమారు 51 ఉంటుంది. ఇది తక్కువ కేటగిరీ కిందకే వస్తుంది, అంటే ఇది రక్తంలో షుగర్‌ను మరీ వేగంగా పెంచదు.

మనం మామిడి పండును ఎలా తింటున్నాం అన్నదే ముఖ్యం. విదేశాల్లో పండ్లను భోజనంలో ఒక భాగంగా తీసుకుంటారు. కానీ మన దగ్గర భోజనం అంతా ముగించి, కడుపు నిండా తిన్న తర్వాత అదనంగా మామిడి పండు ముక్కలను తింటాం. దీనివల్ల శరీరానికి అందాల్సిన క్యాలరీల కంటే ఎక్కువ అందుతాయి. ఫలితంగా బరువు పెరగడం, షుగర్ లెవల్స్ అదుపు తప్పడం జరుగుతుంది.

మధుమేహ బాధితులు మామిడి పండ్లను ఆస్వాదించాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు తప్పనిసరి. మొదటిది, మామిడి పండును జ్యూస్ రూపంలో అస్సలు తీసుకోకూడదు. జ్యూస్‌గా చేసినప్పుడు అందులోని పీచు పదార్థం (ఫైబర్) పోయి, షుగర్ నేరుగా రక్తంలో కలిసిపోతుంది. ఎప్పుడైనా సరే పండును ముక్కలుగా కోసుకుని తినడమే శ్రేయస్కరం. రెండోది, మీరు మామిడి పండు తినాలనుకున్న రోజున, అన్నం లేదా ఇతర కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని కొంచెం తగ్గించాలి. అంటే, ఒక పూట తీసుకునే పిండి పదార్థాలకు బదులుగా మామిడి పండును తినాలి.

అలాగే, మామిడి పండును ఉదయం పూట వ్యాయామానికి ముందు తీసుకోవడం మంచిది. దీనివల్ల అందులోని క్యాలరీలు ఖర్చయిపోతాయి. మామిడి పండు ముక్కలతో పాటు కొన్ని నట్స్ (బాదం, వాల్‌నట్స్) వంటి ప్రోటీన్ ఆహారాన్ని కలిపి తీసుకుంటే చక్కెరను కంట్రోల్ అవుతుంది. మొత్తానికి చెప్పాలంటే, షుగర్ ఉన్నవారు మామిడి పండ్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మితంగా, సరైన పద్ధతిలో తింటే ఈ వేసవి తీపిని మీరు కూడా నిశ్చింతగా ఆస్వాదించవచ్చు.

Follow Us