నీచు వాసన రాకుండా చికెన్ కూర త్వరగా అవ్వాలా.. జస్ట్ ఇలా చేస్తే నిమిషాల్లోనే సూపర్ టేస్ట్..

మాంసాహార ప్రియులు కోడి మాంసంను ఇష్టంగా వండుకుని తింటారు.. అయితే.. కొన్ని పొరపాట్లతో చికెన్ కర్రీ నీచు వాసన వస్తుంది. అయితే.. చికెన్ కర్రీని నీచు వాసన లేకుండా, రుచిగా వండుకోవాలంటే కొన్ని టిప్స్ ను పాటించాలి. దీనిద్వారా చికెన్ కర్రీ అద్భుతంగా మారుతుంది.

నీచు వాసన రాకుండా చికెన్ కూర త్వరగా అవ్వాలా.. జస్ట్ ఇలా చేస్తే నిమిషాల్లోనే సూపర్ టేస్ట్..
Chicken Curry

Updated on: May 11, 2026 | 3:58 PM

నాన్ వెజ్ ప్రియులు చికెన్ ను ఇష్టంగా లొట్టలేసుకుంటూ మరి తింటారు.. కర్రీ, ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ బగారా .. ఇలా ఎన్నో రకాలుగా వండుకుని తింటారు.. చికెన్ ఎప్పుడు వండినా.. ఎవరు వండినా.. మసాలా దినుసుల సువాసనతోపాటు మంచి రుచి వస్తుంది. తయారీని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది. అయితే, చికెన్ కొంత మంది వండితే.. నీచు వాసన వస్తుంది. అలా రాకుండా.. ఉండేందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. నీచు వాసన లేకుండా రుచికరమైన చికెన్ కర్రీ తయారీకి ఒక ప్రత్యేకమైన పద్ధతిని పాటించాలి. చికెన్ కర్రీ రుచిగా రావాలంటే ఏం చేయాలో చూద్దాం..

ముందుగా, కిలో చికెన్‌ ను తీసుకోని.. మంచిగా శుభ్రం చేసుకోని మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, చికెన్ మసాలాతో మ్యారినేట్ చేసుకోవాలి. వంట కోసం మధ్యస్థ పరిమాణంలోని నాలుగు ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. నాన్-వెజ్ వంటకాలకు కొద్దిగా ఎక్కువ ఆయిల్ అవసరం అవుతుంది. కాబట్టి, మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక నాలుగు లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, జాపత్రి, రెండు యాలక్కాయలు, రాతి పువ్వు, అర టీస్పూన్ జీలకర్ర వేసి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ మసాలాలు చికెన్‌కు మంచి ఫ్లేవర్‌ను అందిస్తాయి.

తరువాత, ఒక రెమ్మ కరివేపాకు, పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి వేసి వేయించాలి. వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి, మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గేటప్పుడే ఒక టీస్పూన్ సాల్ట్, అర టీస్పూన్ పసుపు వేసి కలిపి, సిమ్‌లో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఉల్లిపాయలు మెత్తగా మగ్గడం కూరకు మంచి రుచిని ఇస్తుంది.

ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఈ దశ చాలా కీలకం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత, ముందుగానే ఉప్పు, కారం, పసుపు కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ను వేయాలి. చికెన్‌ను వేసిన తర్వాత బాగా కలిపి, మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. చికెన్ నుండి నీళ్లు వస్తాయి.. ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయి, ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించడం వల్ల చికెన్‌లోని నీచు వాసన పోయి, రుచి పెరుగుతుంది. మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి.

నీళ్లు పూర్తిగా ఇంకిపోయి, నూనె విడిపోయిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి సిమ్ లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది మసాలాలు చికెన్ ముక్కలకు బాగా పట్టేలా చేస్తుంది. ఇప్పుడు ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి, బాగా కలిపి, సిమ్ లో పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించాలి. చికెన్ ఉడికి, గ్రేవీ చిక్కబడి, నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఎక్కువ నీళ్లు పోయకుండా, చిక్కటి గ్రేవీతో కూర చేసుకుంటే అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.

చివరగా, అర టీస్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా కసూరి మేతి వేసి కలపాలి. కసూరి మేతి ఐచ్ఛికం అయినప్పటికీ, వేస్తే రుచి చాలా బాగుంటుంది. మళ్లీ రెండు నుండి మూడు నిమిషాలు సిమ్ లో మూత పెట్టి ఉడికించి, నూనె పూర్తిగా పైకి తేలిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పద్ధతిలో చేసిన చికెన్ కర్రీ నీచు వాసన లేకుండా అద్భుతమైన రుచితో ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us