
మన దేశంలో చపాతీకి ప్రత్యేక స్థానం ఉంది. రోజూ లంచ్, డిన్నర్లలో చాలామంది చపాతీలను ఇష్టంగా తింటారు. అయితే ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు చపాతీలు సరిగ్గా పొంగకపోవడం, కాసేపటికే అప్పడాల్లా గట్టిగా మారిపోవడం మహిళలకు తరచూ ఇబ్బంది పెట్టే సమస్య. నిజానికి పిండి కలపడం నుంచి పెనంపై కాల్చే వరకు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దీనికి కారణం. హోటల్ లేదా రెస్టారెంట్ తరహాలో చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు..
గోరువెచ్చని నీరు లేదా పాలు: పిండిని కలపడానికి సాధారణ చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని వాడాలి. మరింత మృదువుగా రావాలంటే కొన్ని చుక్కల పాలు లేదా కొద్దిగా నూనెను పిండిలో జోడించవచ్చు.
కనీసం 8-10 నిమిషాల మర్దన: పిండిని వేగంగా కలిపి పక్కన పెట్టేయకూడదు. కనీసం 8 నుంచి 10 నిమిషాల పాటు చేతులతో బాగా ఒత్తుతూ కలపడం వల్ల అందులోని గ్లూటెన్ సరిగ్గా విడుదలై పిండి సాగే గుణాన్ని, మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
15-20 నిమిషాల రెస్ట్ టైమ్: పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయకూడదు. పిండిపై తడి గుడ్డ లేదా మూత పెట్టి కనీసం 15 నుంచి 20 నిమిషాలు నాననివ్వాలి. దీనివల్ల పిండి తేమను పీల్చుకుని మరింత సాఫ్ట్‌గా మారుతుంది.
సమానంగా ఒత్తడం: చపాతీలను రోల్ చేసేటప్పుడు మరీ ఎక్కువ బలం ఉపయోగించకూడదు. మధ్యలో పల్చగా, అంచుల్లో మందంగా కాకుండా అన్ని వైపులా ఒకే మందంలో ఉండేలా ఒత్తుకోవాలి.
పెనం సరైన వేడి: పెనం సరిగ్గా వేడెక్కకముందే చపాతీ వేస్తే అది గట్టిపడుతుంది. పెనం బాగా వేడెక్కిన తర్వాతే చపాతీని వేయాలి.
మధ్యస్థ మంట: చపాతీలను సిమ్ లేదా హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్‌పై కాల్చాలి. మొదట ఒకవైపు కొద్దిగా బుడగలు రాగానే తిప్పి, రెండో వైపు పూర్తిగా కాలాక మళ్లీ తిప్పితే చపాతీ చక్కగా పూరీలా పొంగుతుంది.
ఈ చిన్న మార్పులు చేసుకుంటే గంటల తరబడి చపాతీలు ఆరిపోకుండా, దూదిలా మెత్తగా, ఎంతో రుచికరంగా ఉంటాయి.