
ఉదయాన్నే వేడివేడి పూరీ, దానికి తోడు ఆలు కుర్మా లేదా బేసన్ కనిపిస్తే చాలు.. ఆహార ప్రియుల నోరూరుతుంది. చాలామంది ఇష్టపడే అల్పాహారాల్లో పూరీ ఒకటి. అయితే పూరీ తింటే నూనె ఎక్కువైపోతుంది, బరువు పెరుగుతాం, అనారోగ్యం పాలవుతాం అనే భయంతో చాలామంది దీనికి దూరంగా ఉంటుంటారు. సరిగ్గా వేయించకపోతే పూరీ జిడ్డుగా మారి, రుచిని కూడా కోల్పోతుంది. కానీ సరైన పద్ధతిలో చేస్తే పూరీ బొట్టు నూనె కూడా ఎక్కువగా పీల్చకుండా, బెలూన్‌లా పొంగుతూ ఎంతో రుచిగా వస్తుంది. పిండి కలపడం దగ్గరి నుంచి వేయించే దాకా కొన్ని సులభమైన కిచెన్ చిట్కాలు పాటిస్తే చాలు.
పాలతో పిండి కలపడం: పూరీలు మెత్తగా, బాగా పొంగాలంటే పిండిని కేవలం నీళ్లతో కాకుండా సగం నీరు, సగం గోరువెచ్చని పాలు కలిపి పిసకాలని ప్రముఖ చెఫ్ రణ్‌వీర్ బ్రార్ సూచిస్తున్నారు.
పెరుగు లేదా మీగడ: ఒక కప్పు గోధుమ పిండికి ఒక టేబుల్ స్పూన్ తాజా పెరుగు లేదా మీగడ కలిపితే పిండి మృదువుగా మారి, పూరీలు చాలా సేపటి వరకు మెత్తగా, పొంగినట్లే ఉంటాయి.
రవ్వతో క్రంచీ టచ్: కొద్దిగా క్రిస్పీగా కావాలనుకునేవారు రెండు కప్పుల గోధుమ పిండికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల సన్నని బొంబాయి రవ్వను కలపాలి.
పిండిని గట్టిగా కలపాలి: ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, ఒక చెంచా నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ పిండిని గట్టిగా పిసకాలి. చపాతీ పిండిలా మెత్తగా ఉంటే పూరీలు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి.
నానబెట్టడం: కలిపిన పిండిపై కొద్దిగా నూనె రాసి, తడి గుడ్డ కప్పి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత మరో నిమిషం పాటు బాగా ఒత్తుకుని సమాన పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి.
ఒత్తే పద్ధతి: పూరీలను రుద్దేటప్పుడు పొడి పిండి అస్సలు వాడకూడదు. పొడి పిండి నూనెను త్వరగా మాడ్చేస్తుంది. బదులుగా చపాతీ పీటకు, పూరీకి కొద్దిగా నూనె రాసి సమాన మందంతో గుండ్రంగా ఒత్తుకోవాలి.
నూనె ఉష్ణోగ్రత ముఖ్యం: నూనె బాగా వేడెక్కిన తర్వాతే పూరీని వేయాలి. పూరీ వేసిన వెంటనే చిల్లుల గరిటెతో దానిపై సున్నితంగా నొక్కితే అది బెలూన్‌లా ఉబ్బుతుంది. రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి తీస్తే చాలు.
ఇలా చేస్తే ఏమాత్రం జిడ్డు లేకుండా గుల్లగా ఉండే పరిపూర్ణమైన పూరీలు సిద్ధమవుతాయి. వేడివేడి పూరీలను ఆలూ కూర లేదా సాగుతో వడ్డిస్తే ఆ రుచే వేరు.