
ఫ్లాక్సీడ్స్ బాదం లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో పెడితే 8 నుండి 10 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ఆకలి వేస్తే ఒక లడ్డూ తిని నీళ్లు తాగడం వల్ల చాలా గంటలపాటు ఆకలి అనిపించదు. ఈ లడ్డూలను తరచూ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఈ లడ్డూలు తయారు చేయడానికి కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
ముందుగా స్టౌవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మధ్యస్థ మంటపై వేడి చేయండి. అందులో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులను విడివిడిగా వేయించి ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అవిసె గింజలను కూడా వేయించి అదే ప్లేట్ లో నువ్వులతో కలపండి. బాదంను కూడా కొద్దిగా గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అవి మాడిపోకుండా చూసుకోండి.
వేయించిన ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి వేడి చేసి బెల్లం పొడి వేసి కలుపుతూ కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న గింజల పొడిని, ఏలకుల పొడిని బెల్లం మిశ్రమంలో వేసి బాగా కలపండి.
ఇప్పుడు స్టౌవ్ ఆఫ్ చేసి మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో భద్రపరచాలి. ఫ్రిజ్ లో పెట్టినా బాగుంటాయి.
ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన లడ్డూలు పిల్లలకు, పెద్దలకు అందరికీ బాగా నచ్చుతాయి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి.