
ఆంధ్రుల ఆహార సంస్కృతిలో గోంగూర పచ్చడికి ప్రత్యేకమైన స్థానం ఉంది.. అందుకే.. దీన్ని ఆంధ్రమాత, పుంటికూర అంటూ ఇష్టంగా పిలుచుకుంటారు.. గోంగూరలో విటమిన్-సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకుని తింటే.. రుచి అద్భుతంగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకుంటే 10 రోజులకు పైగా తాజాగా ఉండే ఈ పల్లెటూరి స్టైల్ గోంగూర పచ్చడి తయారీ విధానాన్ని ఈ కథనంలో తెలుసుకోండి..
పల్లీలు వేయించడం: మొదట బాణలిలో (పాన్) వేరుశనగ గుళ్లను చిన్న మంటపై దోరగా వేయించి, మిక్సీ జార్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
గోంగూర, టమాటా మగ్గించడం: అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, గోంగూర వేయాలి. మూత పెట్టి చిన్న మంటపై గోంగూరలోని తేమ (చెమ్మ) పూర్తిగా ఆరిపోకుండా సాఫ్ట్‌గా మగ్గించి చల్లారనివ్వాలి.
పచ్చడి గ్రైండింగ్: మొదట మిక్సీ జార్‌లోని పల్లీలను మెత్తగా పొడి చేయాలి. ఆ తర్వాత మగ్గించిన గోంగూర-టమాటా మిశ్రమం, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి రోట్లో దంచినట్లుగా (కచ్చాపచ్చాగా) కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి.
ఉల్లిపాయలు కలపడం: గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసుకుని, అదే మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసి పల్స్ మోడ్‌లో ఒక్కసారి కచ్చాపచ్చాగా తిప్పి పచ్చడిలో బాగా కలపాలి.
బాణలిలో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. అందులో తాలింపు గింజలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేయించాలి.
చివరగా తాలింపులో తయారుచేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు నూనెలో మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి. అనంతరం అన్నంలో సర్వ్ చేసుకోవచ్చు.. కొంచెం నెయ్యి వేసుకుని తింటే దీని రుచి అద్భుతంగా మారిపోతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..