పేదవాడి పండు అరటి పండు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే అరటి పండ్లు మాత్రమే కాదు అసలు అరటి చెట్టు అణువణువు ఉపయోగమే.. అందుకే ఆంధ్రులు అరటి చెట్టుని కల్పవృక్షం అని అంటారు. అరటి ఆకులో భోజనం ఆరోగ్యానికి మేలు.. అరటి పువ్వు, అరటి పండ్లు, అరటి కాయ, అరటి దూట ఇలా అన్ని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఆంధ్రులు ముఖ్యంగా కోనసీమ వాసులు అరటి పువ్వుతో ఎన్నో రకాల ఆహార పదార్ధాలు తయారు చేస్తారు. ఈ రోజు గోదావరి జిల్లా స్టైల్ లో అమ్మమ్మల కాలం నాటి అరటి పువ్వు ఆవపెట్టి కూర రెసిపీ తెలుసుకుందాం..
తయారీ విధానం: ముందుగా అరటిపువ్వు వలిచి సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో మజ్జిగ, పసుపు, ఉప్పు వేసి కట్ చేసుకున్న అరటి పువ్వు ముక్కలు వేసి ఉడికించాలి. తర్వాత అరటి పువ్వు ముక్కలను వేరే గిన్నెలోకి తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. అనంతరం నీరు లేకుండా అరటి పువ్వు ముక్కలను వార్చుకుని ఒక పక్కకు పెట్టుకోవాలి. (ఇలా చేయడం వలన అరటి పువ్వు నల్లగా మారదు.) ఇప్పుడు స్టౌ వెలిగించి ఒక దళసరి గిన్నె పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు పల్లీలు, జీడి పప్పు, శనగ పప్పు, మినపఫ్పు, పచ్చిమిర్చి చీలికలు , వేసి వేయించి తర్వాత ఆవాలు జీలకర్ర, ఎండు మిరపకాయ ముక్కలు వేయించాలి. తర్వాత కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి.
పోపు వేగిన తర్వాత ఉడికించి పక్కకు పెట్టుకున్న అరటి పువ్వు ముక్కలు వేసుకుని కొంచెం పసుపు, ఉప్పు చూసి రుచికి సరిపడా ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి. తరవాత రెండు స్పూన్ల చింత పండు గుజ్జు వేసి బాగా కలిపి మంటను తగ్గించి మగ్గబెట్టుకోవాలి. ఇంట్లో ఆవ పెట్టడానికి కొంచెం ఆవాలు, ఒక ఎండు మిర్చి వేసి ముద్దగా నూరుకుని .. రెండు స్పూన్ల పేస్ట్ తీసుకుని కొంచెం నూనె లో కలిపి .. ఈ మిశ్రమాన్ని అరటి పువ్వు కూరలో వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో అమ్మమ్మల కాలం నాటి రుచికరమైన అరటివువ్వు ఆవ కూర రెడీ..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..