
ఎండుచేపలు (Dry Fish) అంటే చాలా మందికి ఎంతో ఇష్టమైన ఆహారం. వీటి రుచి, వాసన కొందరికి నచ్చకపోయినా, ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అందరికీ ఇవి మేలు చేయవని, కొందరు ఖచ్చితంగా ఎండుచేపలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ఆధారంగా ఎండుచేపల వల్ల కలిగే ప్రయోజనాలు.. ఎవరు వీటిని తీసుకోకూడదో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
వాస్తవానికి ఎండు చేపలలో ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఐరన్, విటమిన్ డి వంటి కీలక పోషకాలు అధికంగా ఉంటాయి. పచ్చి చేపల కంటే వీటిలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల పోషకాల గాఢత, నాణ్యమైన ప్రోటీన్లు చాలా ఎక్కువ మోతాదులో లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఎముకల బలానికి మంచిది: ఎండుచేపల్లో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, పళ్లను బలోపేతం చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి.
రోగ నిరోధక శక్తి పెంపు: వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సమస్యలను త్వరగా తగ్గించడంలో దోహదపడతాయి.
మహిళల ఆరోగ్యానికి మేలు: మహిళల్లో మూత్రాశయం, గర్భాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఎండుచేపలు సహాయపడతాయి. ముఖ్యంగా బాలింతలు వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
మెరుగైన రక్త ప్రసరణ: వీటిలోని పోషకాలు రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి, శరీరంలోని వివిధ అవయవాలకు తగినంత పోషణను అందిస్తాయి.
ఎండుచేపలను నిల్వ ఉంచేందుకు అధిక మొత్తంలో ఉప్పు ఉపయోగిస్తారు. కాబట్టి ఈ క్రింది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది:
గుండె జబ్బులు – హై బిపి (రక్తపోటు): ఎండుచేపల్లో సోడియం (ఉప్పు) శాతం చాలా అధికంగా ఉంటుంది. ఇది బిపిని పెంచి, గుండె సమస్యలు ఉన్నవారికి ముప్పుగా మారే అవకాశం ఉంది.
కిడ్నీ (మూత్రపిండాల) సమస్యలు ఉన్నవారు: మూత్రపిండాల పనితీరు బలహీనంగా ఉన్నవారు అధిక ఉప్పు ఉండే ఎండుచేపలను తీసుకోకూడదు.
మధుమేహం (డయాబెటిస్): షుగర్ ఉన్నవారు ఎండుచేపలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
అలర్జీలు ఉన్నవారు: దద్దుర్లు, బొబ్బలు, చర్మంపై దురద వంటి అలర్జీ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.
కలిపి తినకూడని ఆహారాలు: ఎండుచేపల వంటకాలను మజ్జిగ, పెరుగు లేదా పచ్చి కూరగాయలతో కలిపి తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు లేదా అలర్జీలు రావచ్చని పేర్కొంటున్నారు. అలాగే.. జలుబు, దగ్గు, సైనస్, ఆస్తమా సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి.. ఎండుచేపలు శరీరానికి మంచివే అయినప్పటికీ, మోతాదుకు మించి ఎక్కువగా తింటే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఎండుచేపలు ఆరోగ్యానికి అనేక పోషకాలను అందించినప్పటికీ, ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్యుని సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..