
భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగొచ్చా..? తాగితే ఏమవుతుంది.. తరచూ ఇలాంటి సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతుంటాయి.. ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు, పండితులు పలు ఆసక్తికర విషయాలను చెబుతున్నారు. పండితుల ప్రకారం.. మానవ జీవన విధానంలో ఆర్ష ధర్మాలు, సనాతన నియమాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి మన ధర్మశాస్త్రాలు విస్తృతంగా వివరించాయి. ఈ నియమాలు కేవలం సాంప్రదాయాలు కాదని, అవి శాస్త్రీయ దృక్పథంతో కూడుకున్నవని పలువురు పేర్కొంటున్నారు.
ఆధునిక విజ్ఞానానికి, సనాతన ధర్మ నియమాలకు మధ్య కొన్ని విషయాలలో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ, అనేక అంశాలలో రెండూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయి. ఉదాహరణకు, నెయ్యి గురించి ఆర్ష విజ్ఞానం, ఆధునిక సైన్స్ భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. అయితే, భోజన సమయంలో నీళ్ళు తాగడం అనే కీలకమైన అంశంపై రెండూ ఏకాభిప్రాయానికి వస్తాయి.
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగవచ్చా? ఎప్పుడు తాగాలి? అనే ప్రశ్నలు అనేకులలో తలెత్తుతాయి. ఈ విషయమై సైన్స్ పరంగా పరిశీలిస్తే, భోజనం చేసే మధ్యలో నీళ్లు తాగడం వల్ల శరీరంలోనికి గాలి ప్రవేశిస్తుంది. ఇది గ్యాస్ ట్రబుల్స్‌కు, గ్యాస్ట్రిక్ వ్యాధులకు దారి తీస్తుంది. ఆర్ష ధర్మం కూడా ఈ వాదనను సమర్ధిస్తుంది. భోజనం అయిన వెంటనే నీళ్లు తాగితే అది విషంతో సమానం అని ఆయుర్వేద శాస్త్రం స్పష్టంగా చెబుతుంది.
ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. భోజనం మధ్యలో గానీ, భోజనం అయిన వెంటనే గానీ నీరు తాగరాదు. భోజనం పూర్తయిన తర్వాత ఒక 15 నిమిషాల విరామం ఇచ్చి, ఒక గ్లాసు నీరు తాగాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా భోజనం సక్రమంగా జీర్ణమై, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆర్ష ధర్మం చెబుతుంది. ఆధునిక విజ్ఞానం కూడా ఇదే అభిప్రాయాన్ని నిర్ధారిస్తుంది.
భోజనం మధ్యలో గుక్కెడు నీళ్లు తాగడం వల్ల పెద్దగా నష్టం లేదు.. ఎక్కువ నీరు తాగొద్దని సూచిస్తున్నారు. ఒకేసారి కడుపు నిండా నీళ్లు తాగితే జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుందని.. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్తి సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..