జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్ లభించే పవర్‌పుల్ రెసిపీ మీ కోసమే!
జామకాయ అంటే మనకు వెంటనే గుర్తుకువచ్చేది విటమిన్ సి, పీచు పదార్థాలు నిండిన తీపి-వగరు పండు. సాధారణంగా జామకాయను కోసి ఉప్పు, కారం చల్లుకుని తింటాము. అయితే, తమిళనాడు సాంప్రదాయ పద్ధతిలో జామకాయతో పొరియల్ అంటే వేపుడు లేదా తాలింపు చేసుకోవచ్చని మీకు తెలుసా? కేవలం 10 నిమిషాల్లో పూర్తయ్యే ఈ వంటకం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది. జామకాయ పొరియల్ ఎలా తయారు చేయాలో, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.

సాధారణంగా జామకాయను మనం పండుగానే తింటుంటాము. కానీ, జామకాయతో కేవలం 10 నిమిషాల్లో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పొరియల్ తయారు చేసుకోవచ్చు. ఇది ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఒక హెల్తీ రెసిపీ. వేడివేడి అన్నం లేదా రోటీల్లోకి ఇది ఒక మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం అవుతుంది. తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
దోర జామకాయలు – 2 (గింజలు తీసి, చిన్న ముక్కలుగా కోసినవి)
ఆవాలు – పావు స్పూన్
మినపప్పు, శనగపప్పు – చెరో అర స్పూన్
పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
ఎండుమిర్చి – 1
కరివేపాకు, ఇంగువ – తగినంత
పసుపు – చిటికెడు
కారం పొడి – అర స్పూన్
తురిమిన కొబ్బరి లేదా వేయించిన శనగల పొడి – 2 స్పూన్లు
నూనె, ఉప్పు – సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. అందులో ఉప్పు, పసుపు వేసి, మూతపెట్టి 3-4 నిమిషాలు సన్నని మంటపై మగ్గనివ్వాలి. జామకాయ ముక్కలు ఎక్కువగా మెత్తబడకూడదు, క్రంచీగా ఉండాలి. ముక్కలు కాస్త మెత్తబడ్డాక కారం పొడి వేసి కలపాలి. చివరగా తురిమిన పచ్చి కొబ్బరి లేదా వేయించిన శనగపప్పు పొడి చల్లి, బాగా కలిపి స్టవ్ ఆపివేస్తే ఘుమఘుమలాడే జామకాయ పొరియల్ సిద్ధం!
ఆరోగ్య ప్రయోజనాలు:
డయాబెటిస్‌కు మేలు: జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనిలోని ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల: అధిక పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
బరువు తగ్గేందుకు: తక్కువ కలోరీలు, ఎక్కువ పీచు పదార్థం ఉన్నందున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఫైబర్, ప్రోటీన్ కాంబినేషన్.
వేడివేడి అన్నంలో సాంబార్, రసంతో పాటు నంజుకోవడానికి లేదా చపాతీల్లోకి ఈ జామకాయ పొరియల్ అద్భుతంగా ఉంటుంది.




