Ramadan Special Halim: రంజాన్ స్పెషల్ హలీమ్.. ఒక్కసారి హైదరాబాద్ హలీమ్ తిన్నారంటే ఎవ్వరైనా గులామ్ కావాల్సిందే..! అంతలా ఉంటుంది అందులో మజా.. ఒకప్పుడు ముస్లింలు మాత్రమే తినే ఈ హలీం ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. రంజాన్ సీజన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసిన హలీమ్ బట్టీలు వెలిసేవి. కానీ కరోనా వల్ల ప్రస్తుతం అక్కడక్కడ మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. నిజాం కాలంలో ప్రారంభమైన హలీం సంప్రదాయం ఇప్పటికి కొనసాగుతుంది.
ముస్లింల పవిత్రమైన రంజాన్ మాసం వస్తే చాలు ప్రత్యేకంగా తయారు చేసే హలీమ్‌కు మంచి గిరాకీ ఉంటుంది. రంజాన్ మాసంలో విశిష్టమైన ఆహారంగా హలీమ్ నిలుస్తుంది. హైదరాబాద్ హలీమ్ అంటే పడిచచ్చేవాళ్లు మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఉన్నారు. రంజాన్ మాసంలో ప్రతీ వీధికో హాలీమ్ దుకాణం దర్శమనిచ్చేది. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా చార్మినార్, ఓల్డ్ సిటీ, మలక్ పేట, కుల్సుమ్ పుర, బహదూర్ పుర ఇలా అనేక ప్రాంతాల్లో హాలీమ్ అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తారు. హైద్రాబాద్ పిస్తా హౌస్ పేరుతో రాష్ట్రంలో అనేక చోట్ల హలీమ్ సెంటర్లు ఉన్నాయి. అన్ని వర్గాల వారు హాలీమ్ ను ఇష్టపడటంతో చాలాచోట్ల హలీమ్ తయారీ శాలలు పెరిగాయి. పగలంతా ఉపవాసాలు ఉండే ముస్లింలు దీక్షను విరమించాక తక్షణం శక్తి కోసం హలీమ్ స్వీకరిస్తారు.
హలీం ప్రియుల ఆశలపై వైరస్ నీళ్లు చల్లేసింది. హాలీమ్ తయారీని వ్యాపారులు ఆపేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్స్ అన్ని మూతపడ్డాయి. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి వెసులుబాటు ఇవ్వకపోవడంతో హాలీమ్ తయారీ కూడా కష్టమైంది. ఇలాంటి హలీం ఘన చరిత్రకు కరోనా మహమ్మారి గండి కొట్టింది. రుచికరమైన, పౌష్టికాహారమైన హలీమ్‌కు హైదరాబాదీలను దూరం చేసింది. ఆన్‌లైన్‌లో ట్రై చేసి దొరికితే కొంత జిహ్వ చాపల్యాన్ని తీర్చుకోవడం తప్ప ఈ ఏడాది హైదరాబాద్ వాసులు హలీంను కడుపునిండా తిన్నది లేదు.