బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయాన్నే ఓ గ్లాస్ తాగితే లైఫ్ బిందాస్..

రాగి జావ రొటీన్.. కానీ.. ఇలా చేస్తే మాత్రం పవర్‌హౌస్.. ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.. రాగులు, జీడిపప్పు, బాదం, ఇలాచిలను వేయించి, మెత్తని పొడిగా మార్చడం ద్వారా రుచికరమైన, పోషకమైన మిశ్రమాన్ని తయారు చేయవచ్చు. దీన్ని ఒక నెల వరకు నిల్వ ఉంచి, రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారి, జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయాన్నే ఓ గ్లాస్ తాగితే లైఫ్ బిందాస్..
Ragi Java

Updated on: May 11, 2026 | 9:33 AM

ఎండాకాలంలో శరీరంలో వేడిని తగ్గించేందుకు రాగి జావ తాగడం చాలా మంచిది. రాగి జావ (Ragi Java) కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్‌లతో నిండిన ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన పానీయం.. ఇది ఎముకలను బలంగా మార్చుతుంది.. అలాగే.. జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడం, శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో శరీరానికి చలువ చేసి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి జావను ఇంట్లోనే సులభంగా, పోషక విలువలతో కూడిన పద్ధతిలో తయారు చేసుకోవడానికి కావలసిన పిండి మిశ్రమం తయారీ విధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.. బయట లభించే ప్యాకెట్లకు బదులుగా ఇంట్లోనే స్వచ్ఛమైన పిండిని తయారు చేసుకోవడం ద్వారా దాని నాణ్యతను మరింత మెరుగుపర్చవచ్చు..

ముందుగా, కిరాణా షాపుల్లో లేదా సూపర్ మార్కెట్లలో లభించే స్వచ్ఛమైన రాగులను ఎంచుకోండి. వాటిలో ఏదైనా పొట్టు లేదా మలినాలు ఉంటే తొలగించండి. రాగులను ఒక మందపాటి పాత్రలో తక్కువ మంటపై సుమారు పది నిమిషాల పాటు వేయించండి. మంచి, కమ్మటి వాసన వచ్చే వరకు వేయించడం ముఖ్యం. హై ఫ్లేమ్‌లో పెడితే రాగులు మాడిపోతాయి, రుచి పాడవుతుంది. జాగ్రత్తగా, మాడిపోకుండా వేయించుకున్న తర్వాత, వాటిని ఒక ప్లేట్‌లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మంచి సువాసన, రుచి కోసం ఐదు లేదా ఆరు యాలకులను కూడా రాగులతో పాటు వేయించుకొని చల్లార్చండి.

తరువాత, జీడిపప్పు (సుమారు పావు కిలో), బాదం పప్పులను (సుమారు పావు కిలో) విడిగా వేయించుకోవాలి. వీటిని కూడా తక్కువ లేదా మీడియం మంటపై మాడిపోకుండా జాగ్రత్తగా వేయించండి. వేయించిన తర్వాత వీటిని కూడా చల్లారనివ్వాలి. ఈ డ్రై ఫ్రూట్స్‌ను రాగులతో కలిపి మిక్సీ పట్టకూడదు.

వేయించిన జీడిపప్పు, బాదం పప్పులను మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమం నుంచి నూనె బయటకు రాకుండా, పొడిగా ఉండటానికి మిక్సీని ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ పల్స్‌లో గ్రైండ్ చేయడం చాలా ముఖ్యం. పొడిపొడిగా తయారైన తర్వాత, ఈ బాదం-జీడిపప్పు పొడిని ఒక పాత్రలోకి తీసి పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే, ఈ మిశ్రమానికి జొన్నలు, గోధుమలు, సగ్గుబియ్యం, లేదా పెసలు వంటి అదనపు ధాన్యాలను కూడా వేయించి, మిక్సీలో లేదా మిల్లులో పట్టించుకోవచ్చు. అయితే, మిక్సీలో ఎక్కువ పరిమాణంలో పడితే బ్లేడ్లు పాడయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కలపడం ద్వారా.. మరిన్ని పోషకాలు లభిస్తాయి..

చివరగా, వేయించి చల్లార్చిన రాగులు, ఇలాచి మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తని పిండిలా గ్రైండ్ చేయండి. పిండి చాలా మెత్తగా వస్తే జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు. ఈ రాగి పిండిని ముందుగా తయారు చేసుకున్న బాదం-జీడిపప్పు పొడితో బాగా కలపండి. ఈ విధంగా తయారైన రాగి జావ పిండి మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచండి. ఇది ఒక నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది.

ఎన్నో పోషకాలు.. ఇలా తయారు చేసుకోండి..

ఈ ఇంట్లో తయారు చేసుకున్న రాగి జావ మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు రాగి జావ తాగేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.. ఎముకలను దృఢంగా చేస్తుంది. రాత్రిపూట కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ప్రతి వ్యక్తికి రెండు చెంచాల చొప్పున పిండిని కొన్ని నీటిలో నానబెట్టడం మంచిది. ఉదయం వేళ.. దీనిని జావలా తయారు చేసుకొని పాలు, పెరుగు లేదా మజ్జిగ కలిపి తీసుకోవచ్చు. ముందుగా పాత్రలో నీటిని తీసుకోని.. బాగా మరగనివ్వాలి.. మరిగే నీళ్లల్లో నానబెట్టిన పిండిని వేయాలి.. కావాలంటే.. కొంచెం బ్లాక్ సాల్ట్, పచ్చిమర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు.. ఈ జావ ఆరోగ్యానికి ఎంతో మంచిది, తప్పకుండా ప్రయత్నించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us