
ఉదయాన్నే చద్దన్నం తినడం మంచిదేనా అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంది. సాధారణంగా అనారోగ్యం, జ్వరం వచ్చినప్పుడు పత్యం కూరలైన బీరకాయ, సొరకాయ, పొట్లకాయ వంటివి తినమని పెద్దలు చెబుతుంటారు. ఇవి చలువ చేసి, సులభంగా జీర్ణమయ్యే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ పత్యం ఆహారం జీర్ణశక్తిని పెంపొందించి, శరీరానికి చలువ చేస్తుంది. వాస్తవానికి, మన పూర్వీకులు ఎక్కువగా పప్పు, పచ్చడి, పెరుగుతో కూడిన సాధారణ ఆహారాన్ని తీసుకునేవారు. అప్పుడప్పుడు లభించే కాయగూరలను ఆహారంలో చేర్చుకునేవారు. వారి ప్రధాన ఆహారంలో అన్నం, పెరుగు, ప్రొటీన్ కోసం పప్పులు ఉండేవి. ఈ ఆహార పద్ధతి వారి జీవితానికి చాలా కాలం పాటు ఆసరాగా నిలిచింది.
ప్రస్తుత జీవనశైలిలో ఎసిడిటీ ఒక సాధారణ సమస్యగా మారింది. ఉదయం పూట ఎసిడిటీ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే రాత్రంతా నిద్రపోయి లేవగానే శరీరం జీర్ణక్రియకు సిద్ధమవుతుంది. ఈ సమయంలో చద్దన్నం లేదా గంజన్నం వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం వలన ఎసిడిటీని గణనీయంగా తగ్గించవచ్చు. వ్యాయామం తర్వాత ఉదయం 7:30 నుండి 8:00 గంటల మధ్య ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీర జీవ గడియారం (Biological clock)కు అనుగుణంగా ఉంటుంది. ఈ సమయంలో చద్దన్నం తీసుకోవడం చాలా మంచిది.. మంచి బ్యాక్టీరియా పెరిగి.. కడుపు ఆరోగ్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.. చద్దన్నం పోషకాల గని.. దీనిలో విటమిన్లు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, విటమిన్ బి-12, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
కాత్రి పూట ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. రాత్రి 8 గంటలలోపు భోజనం పూర్తి చేయడం ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు చాలా అవసరం. 8 గంటలలోపు తిన్నట్లయితే, రాత్రి 10 గంటలకు నిద్రపోయే లోపు ఆహారం పూర్తిగా జీర్ణమై, శరీరంలో గ్రహణ శక్తి (absorption) పెరుగుతుంది. దీంతో శరీరం తేలికగా విశ్రాంతి దశలోకి వెళుతుంది.
అయితే, రాత్రి 10 లేదా 11 గంటలకు ఆలస్యంగా భోజనం చేయడం వలన ఆహారం సరిగా జీర్ణం కాదు. అప్పుడు శరీరం విశ్రాంతి దశలో ఉండటం వల్ల గ్రహణ శక్తి తగ్గిపోతుంది. ఇది యాసిడ్ రీఫ్లక్స్, కఫం, గొంతు మండటం, దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల సమస్యలకు దారితీయవచ్చు.
శారీరక ఫిట్‌నెస్ కూడా జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నవారికి ఏం తిన్నా సులువుగా జీర్ణమవుతుంది. వారి శరీరంలో జీర్ణక్రియకు అవసరమైన అగ్ని సమృద్ధిగా ఉంటుంది. అయితే, దీర్ఘకాలంగా ఆహార నియమాలను పాటించకుండా శరీరాన్ని దుర్వినియోగం చేస్తే, ఎంత ఫిట్‌గా ఉన్నవారికైనా సమస్యలు తలెత్తవచ్చు. చిన్న పిల్లల్లో జీర్ణశక్తి కొంత సున్నితంగా ఉంటుంది. కానీ 16 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సులో జీర్ణక్రియ అత్యంత చురుకుగా ఉంటుంది. ఇదే ఫిట్‌నెస్‌ను జీవితాంతం కొనసాగించగలిగితే, 70 ఏళ్ల వయస్సులో కూడా ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. సరైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన జీవనశైలి ఆరోగ్యకరమైన జీవితానికి పునాదులని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.