అరటి పండు vs ఆరెంజ్.. బీపీని కంట్రోల్ చేయడంలో ఏది తోపు..? ఈ నిజాలు తెలుసుకోండి..

ఉదయం లేవగానే తల వెనుక బరువుగా అనిపిస్తోందా? కొద్దిపాటి పనికే తీవ్రమైన అలసట, తలతిరగడం వేధిస్తున్నాయా? అయితే సైలెంట్ కిల్లర్ అయిన హై బీపీ మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది.. వైద్యుల లెక్క ప్రకారం పొటాషియం ఉండే పండ్లతో బీపీని అదుపులో పెట్టొచ్చు. మరి మార్కెట్లో అందరికీ దొరికే అరటిపండు, నారింజ పండ్లలో బీపీ పేషెంట్లకు ఏది అసలైన ఔషధం? ఏ పండు తింటే బీపీ త్వరగా తగ్గుతుంది? అనేది తెలుసుకుందాం..

అరటి పండు vs ఆరెంజ్.. బీపీని కంట్రోల్ చేయడంలో ఏది తోపు..? ఈ నిజాలు తెలుసుకోండి..
Banana Vs Orange For High Blood Pressure

Updated on: Sep 21, 2026 | 9:16 PM

ఉదయం నిద్రలేవగానే కారణం లేకుండా తల వెనుక భాగంలో విపరీతమైన బరువుగా అనిపిస్తోందా? తల తిరగడం, తీవ్రమైన నీరసం లేదా గుండెలో తెలియని ఆందోళన వేధిస్తున్నాయా? అయితే ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి ఆధునిక వైద్య పరిభాషలో సైలెంట్ కిల్లర్‌గా పిలిచే అధిక రక్తపోటు ప్రారంభ లక్షణాలు కావచ్చు. నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్, ఆహారంలో ఉప్పు మోతాదు పెరగడం వల్ల రక్తపోటు సమస్య వేగంగా పెరుగుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి నిరంతరం అధికంగా ఉన్నప్పుడు అది గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.

పొటాషియమే విరుగుడు: సైన్స్ ఏం చెబుతోంది?

ప్రముఖ రిజిస్టర్డ్ డైటీషియన్ ట్రిస్టా చాన్ ప్రకారం.. అధిక రక్తపోటును సహజంగా నియంత్రించడంలో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలో అధికంగా చేరిన సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపి, రక్తనాళాల గోడలను సడలించడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పొటాషియం కోసం సహజంగా గుర్తుకొచ్చే రెండు పండ్లు అరటిపండు, నారింజ. ఈ రెండింటిలో బీపీని తగ్గించడానికి ఏది ఎక్కువ ప్రభావవంతం?

అరటిపండు: పొటాషియం పవర్‌హౌస్

రక్తపోటును నియంత్రించడానికి తక్షణమే శరీరానికి పొటాషియం అందించాలనుకుంటే అరటిపండు తిరుగులేని ఎంపిక. ఒక సాధారణ అరటిపండులో దాదాపు 375 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. ఇది ఒక వయోజనుడి రోజువారీ శరీర అవసరంలో సుమారు 8 శాతాన్ని తీరుస్తుంది. ఇది శరీరంలోని సోడియం ప్రభావాన్ని తగ్గించి, రక్తనాళాల్లోని రక్త ప్రసరణను సాఫీగా మార్చి బీపీ అకస్మాత్తుగా పెరగకుండా కట్టడి చేస్తుంది.

నారింజ: గుండెకు రక్షణ కవచం

అరటిపండుతో పోలిస్తే నారింజలో పొటాషియం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఇతర శక్తివంతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక నారింజ పండులో సుమారు 232 మిల్లీగ్రాముల పొటాషియం మాత్రమే ఉంటుంది. కానీ ఇందులో శరీరానికి అత్యవసరమైన 83 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది, ఇది రోజువారీ విటమిన్ సి అవసరంలో దాదాపు 91 శాతానికి సమానం. నారింజలోని విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ అనే సహజ యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి.

బీపీ రోగులకు ఏది ఉత్తమం?

మీ ప్రాథమిక లక్ష్యం శరీరంలో పొటాషియం శాతాన్ని పెంచి సోడియంను తరిమికొట్టడమే అయితే అరటిపండు ఉత్తమ ఎంపిక. కానీ రోగనిరోధక శక్తిని పెంచుతూ, రక్తనాళాల వాపును తగ్గించి గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నారింజ ఎంతో అవసరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డాష్ డైట్ విధానంలో ఈ రెండు పండ్లనూ సమతుల్యంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ఒకే పండుపై ఆధారపడకుండా యాపిల్, బెర్రీలు, కివి, పుచ్చకాయ, అవకాడోలను కూడా మార్చి మార్చి ఆహారంలో చేర్చుకోవడం వల్ల సమగ్ర ఆరోగ్యం చేకూరుతుంది.

కేవలం పండ్లు తినడం వల్లే బీపీ పూర్తిగా తగ్గిపోదు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం అత్యంత ముఖ్యం. ఇప్పటికే హైపర్‌టెన్షన్ ఉన్నవారు వైద్యులు సూచించిన మందులను వేళకు వేసుకుంటూనే ఈ సహజ ఆహారపు అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us