జుట్టు కడుపులోకి వెళితే ఏమవుతుందో తెలుసా? పాతకాలపు చిట్కాలు పాటించే ముందు ఈ నిజాలు తెలుసుకోండి!

చాలామంది అన్నంలో వెంట్రుక కనపడగానే పక్కన పెట్టేస్తారు. కానీ కొంతమంది మాత్రం అది బంధుత్వానికి సంకేతం అంటూ గుడ్డిగా నమ్ముతారు. అయితే అది కచ్చితంగా మూఢనమ్మకమే అంటున్నారు నిపుణులు. అన్నంలో వెంట్రుక పడితే ఏం జరుగుతుంది? మన శరీరం దానిని ఎలా స్వీకరిస్తుంది? అనుకోకుండా వెంట్రుకను మింగేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జుట్టు కడుపులోకి వెళితే ఏమవుతుందో తెలుసా? పాతకాలపు చిట్కాలు పాటించే ముందు ఈ నిజాలు తెలుసుకోండి!
Finding Hair In Food.jpg

Updated on: Apr 08, 2026 | 10:28 AM

ఎంత రుచికరమైన వంటకాన్నైనా ఒక్క వెంట్రుక ముక్క పూర్తిగా పాడుచేయగలదు. ఇంట్లో ఎంత జాగ్రత్తగా వండినా, ఒక్కోసారి అనుకోకుండా అన్నంలో వెంట్రుక కనిపిస్తే చాలు.. తినాలనే కోరిక చచ్చిపోతుంది. అయితే, అన్నంలో వెంట్రుక వస్తే బంధుత్వం బలపడుతుందని చెప్పే మాటలు కేవలం ఒక అపోహ మాత్రమే. దీనివల్ల కొన్నిసార్లు శరీరంలో అలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెంట్రుకలో ఏముంటుంది?

మనుషుల జుట్టు కెరాటిన్ అనే ఒక రకమైన ప్రోటీన్‌తో తయారవుతుంది. నిజానికి, కేవలం వెంట్రుక వల్ల శరీరానికి నేరుగా పెద్దగా హాని కలగదు. కానీ, మనం వాడే షాంపూలు, హెయిర్ డ్రైలలో ఉండే రసాయనాలు లేదా బయటి దుమ్ము కణాలు వెంట్రుకలకు అంటుకుని ఉంటాయి. ఇవి ఆహారంలో కలిసినప్పుడు ఆహార నాణ్యత దెబ్బతినడమే కాకుండా, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అందుకే వెంట్రుక పడిన ఆహారాన్ని తినడానికి చాలామంది ఇష్టపడరు.

అన్నం తింటున్నప్పుడు అనుకోకుండా వెంట్రుక మింగేస్తే, అది నాలుక కింద లేదా గొంతులో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల వెంటనే వికారం కలుగుతుంది. ఈ కంగారులో చాలామంది గొంతులో వేళ్లు పెట్టి వాంతులు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల గొంతుకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. వెంట్రుక అనుకోకుండా గొంతు దాటి కడుపులోకి వెళ్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. మన శరీరం అపరిచిత వస్తువులను బయటకు పంపేలా రూపొందించబడింది.

శరీర రక్షణ యంత్రాంగం

కడుపులోకి వెళ్లిన వెంట్రుకను బయటకు పంపడానికి శరీరంలోని సహజ ప్రక్రియలు మొదలవుతాయి. ఇందులో భాగంగా ఒక్కోసారి స్వల్పంగా విరేచనాలు కూడా కావచ్చు. ఇది శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ఒక రక్షణ యంత్రాంగం. అటువంటప్పుడు వెంటనే విరేచనాలు తగ్గడానికి మందులు వేసుకోకూడదు. సాధారణంగా వెంట్రుక ఆ విరేచనంతో పాటు బయటకు వెళ్లిపోతుంది. అయితే, విరేచనాలు ఎక్కువై శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

అపోహలు- వాస్తవాలు

పూర్వ కాలంలో వెంట్రుక మింగేస్తే అన్నం ముద్దను నమలకుండా మింగాలని లేదా వరి ధాన్యం గింజను మింగాలని చెప్పేవారు. వెంట్రుక ఆ గింజకు చుట్టుకుని బయటకు వస్తుందని నమ్మేవారు. ఇవి అప్పట్లో కొన్నిసార్లు పనిచేసి ఉండవచ్చు కానీ, వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి ఇటువంటి ప్రయోగాలు చేయడం కంటే, వండేటప్పుడు మరియు వడ్డించేటప్పుడు తలపాగా లేదా నెట్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. తింటున్నప్పుడు దృష్టి అంతా ఆహారంపైనే ఉంచితే ఇటువంటి సమస్యలను నివారించవచ్చు.

 

Follow Us