
గత కొన్నేళ్లుగా పొడవైన గోళ్లు, విభిన్న రంగులు, రకరకాల చార్మ్‌లు, పెర్ల్స్, కార్టూన్ డిజైన్లను వేసుకోవడం ట్రెండ్‌గా మారింది. హాలీవుడ్ ప్రముఖులు కార్దాషియాన్ సోదరీమణుల నుంచి నికీ మినాజ్ వరకు సెలబ్రిటీలు ప్రతివారం సరికొత్త నెయిల్ ఆర్ట్‌తో మెరిసిపోతున్నారు. వీరిని అనుకరిస్తూ మిలియన్ల మంది నెయిల్ సెలూన్ బాట పడుతున్నారు. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. 2023లో గ్లోబల్ నెయిల్ సెలూన్ మార్కెట్ విలువ 11.96 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి ఇది 20.30 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అయితే మనం ఎంతో ఇష్టపడే ఈ నెయిల్ పాలిష్ వెనుక దాగివున్న రసాయనాల గురించి ఎంతమందికి తెలుసు?
సోషల్ మీడియా వేదికగా నెయిల్ పాలిష్‌ల వాడకం వల్ల క్యాన్సర్ ముప్పు ఉందనే వార్తలు నెటిజన్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అంశంపై గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వర్తిక విశ్వాని స్పష్టతనిచ్చారు. సాంప్రదాయ నెయిల్ పాలిష్‌లలో ఫార్మాల్డిహైడ్, టోలుయీన్, డీబీపీ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని ఆమె తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రూప్ 1 కార్సినోజెన్ గా వర్గీకరించింది.
ఎప్పుడో ఒకసారి లేదా అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకునే సాధారణ ప్రజలకు దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ. కానీ ప్రతిరోజూ గంటల తరబడి ఈ రసాయన వాసనలను పీల్చే సెలూన్ కార్మికులకు మాత్రం నాసోఫారింజియల్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. రసాయనాల సాంద్రత కంటే కూడా ఎంత ఎక్కువ సమయం ఆ వాతావరణంలో గడుపుతున్నారనేదే ప్రమాద తీవ్రతను నిర్దేశిస్తుంది. హానికర రసాయనాలు లేని పాలిష్‌లను ఉపయోగించడం వల్ల సాధారణ వినియోగదారులకు ఎలాంటి భయం అక్కర్లేదని ఆమె వివరించారు.
నెయిల్ ఆర్ట్‌ను వేగంగా ఎండబెట్టేందుకు ఉపయోగించే యువీ ల్యాంప్‌లపై 2023లో వచ్చిన ఒక అధ్యయనం సంచలనం సృష్టించింది. ఈ ల్యాంప్‌ల నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు డీఎన్ఏను పరివర్తనం చేసి చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని భావిస్తున్నారు. అయితే ఈ అధ్యయనం ఇప్పటివరకు కేవలం ల్యాబ్ ప్రయోగాల్లో మాత్రమే నిరూపితమైందని, మానవులపై దీని ప్రభావంపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని డాక్టర్ వర్తిక తెలిపారు.
ఫ్రీ లేబుళ్లను చూడండి: నెయిల్ పాలిష్ కొనేముందు 5-free, 10-free, లేదా 13-free అని ఉందో లేదో సరిచూసుకోండి. ఇవి ప్రమాదకర రసాయనాలు లేని ఉత్పత్తులను సూచిస్తాయి.
ఇంగ్రీడియంట్స్ చెక్ చేయండి: కొనుగోలు చేసే ముందు ఫార్మాల్డిహైడ్, టీపీఓ , టోలుయీన్, క్యాంఫర్, డిబిపి వంటి రసాయనాలు లేవని నిర్ధారించుకోండి.
సన్‌స్క్రీన్ వాడండి: యువి ల్యాంప్ ఉపయోగించే ముందు చర్మానికి డిఎన్ఏ నష్టం జరగకుండా ఉండేందుకు చేతులకు సన్‌స్క్రీన్ లోషన్ రాయండి.
సెలూన్లలో ప్రశ్నించండి: మీ సెలూన్‌లో ఎలాంటి నెయిల్ పాలిష్‌లు, రసాయనాలు ఉపయోగిస్తున్నారో అడిగి తెలుసుకోండి.
మరోవైపు డిజైన్ల కంటే సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రకాశవంతమైన రంగులు, గంటల తరబడి చేసే ఆర్ట్‌ల కంటే నాచురల్, షీర్ గ్లాస్డ్ నెయిల్స్ ఇప్పుడు క్వైట్ లగ్జరీకి చిహ్నంగా మారాయి. సెలబ్రిటీలు, ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్లు భారీ ఖర్చుతో కూడిన సెలూన్ అపాయింట్‌మెంట్‌లను పక్కనపెట్టి, ఈ సింపుల్ అండ్ నేచురల్ నెయిల్ ట్రెండ్‌వైపు మొగ్గు చూపుతున్నారు.