మీరు లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

Bedroom Lighting Tips: కొంతమంది బెడ్ లైట్ వేసుకుని నిద్రించడం చాలా సాధారణం. అయితే స్వల్పమైన వెలుతురు కూడా నిద్రను గణనీయంగా దెబ్బతీస్తుంది. “లైట్ ఆన్ చేసి నిద్రపోతే ఏమవుతుంది?” అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కానీ పూర్తిగా చీకటిలో నిద్రపోవడం ఎంత ఆరోగ్యకరమో తెలుసుకోవడం కూడా ముఖ్యం.

మీరు లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!
Sleep With Light

Updated on: Feb 22, 2026 | 4:36 PM

మనలో చాలామందికి రాత్రిళ్లు చిన్న లైట్ వెలిగించి నిద్రపోయే అలవాటు ఉంటుంది. చిన్నప్పటి భయం వల్ల కావచ్చు, లేక చీకటిలో అసౌకర్యంగా అనిపించడం వల్ల కావచ్చు.. బెడ్ లైట్ వేసుకుని నిద్రించడం చాలా సాధారణం. అయితే మరికొందరికి స్వల్పమైన వెలుతురు కూడా నిద్రను గణనీయంగా దెబ్బతీస్తుంది. “లైట్ ఆన్ చేసి నిద్రపోతే ఏమవుతుంది?” అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కానీ పూర్తిగా చీకటిలో నిద్రపోవడం ఎంత ఆరోగ్యకరమో తెలుసుకోవడం కూడా ముఖ్యం.

చీకటిగా ఉంటేనే..

మన శరీరం 24 గంటల జీవ చక్రం అయిన సర్కేడియన్ రిథమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ అంతర్గత గడియారం నిద్ర, శక్తి స్థాయిలు, హార్మోన్ల ఉత్పత్తి, జీవక్రియ, మానసిక స్థితిని నియంత్రిస్తుంది. చీకటి పడినప్పుడు మెదడు “మెలటోనిన్” అనే నిద్ర హార్మోన్‌ను విడుదల చేయమని శరీరానికి సంకేతం ఇస్తుంది. అదే వెలుతురు ఉన్నప్పుడు, ముఖ్యంగా రాత్రివేళల్లో, మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.

నిద్ర నాణ్యతపై ప్రభావం..

కాబట్టి చిన్న దీపం వెలుతురు అయినా సరే, అది మెలటోనిన్ స్థాయిలను తగ్గించి నిద్ర నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. దీని ఫలితంగా ఉదయం లేవగానే అలసట, తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని పరిశోధనలు రాత్రి వెలుతురులో నిద్రపోవడం శరీర జీవక్రియను మార్చి, బరువు పెరగడానికి లేదా ఊబకాయానికి కారణమవుతుందని సూచిస్తున్నాయి.

మెదడుకు విశ్రాంతి లేకపోవడంతో..

మన కనురెప్పలు మూసి ఉన్నప్పటికీ, వెలుతురు మెదడుకు సంకేతాలు పంపగలదు. దీంతో మెదడు పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి వెళ్లలేకపోవచ్చు. మెలటోనిన్ తగ్గడం వల్ల నిద్ర మాత్రమే కాదు, ఇతర హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింటుంది. తాజా అధ్యయనాలు రాత్రి వెలుతురులో నిద్రపోవడం హృదయ స్పందన రేటు, రక్తపోటుపై కూడా ప్రభావం చూపవచ్చని చెబుతున్నాయి. ముఖ్యంగా మసక నీలి కాంతి (బ్లూ లైట్) శరీర సహజ నిద్ర చక్రాన్ని మరింతగా భంగం కలిగిస్తుంది.

నిపుణుల సూచన

అందుకే, మంచి నిద్ర కోసం పడకగదిని సాధ్యమైనంత వరకు చీకటిగా ఉంచడం మంచిది. అవసరమైతే మసకబారిన, వెచ్చని రంగు నైట్ ల్యాంప్ ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మంచి నిద్ర ఆరోగ్యానికి పునాది.. కాబట్టి చిన్న అలవాట్లలో మార్పులు కూడా పెద్ద ప్రయోజనాలను అందించగలవు.

Follow Us