
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దీంతో ఉపశమనం కోసం జనాలు చల్లని పానీయాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. మార్కెట్లో రకరకాల చల్లని పానీయాలు అందుబాటులో ఉన్నాయి. కొందరు వాటిని తాగుతూ ఉపశమనం పొందుతారు. మరి కొందరు వాటితో పాటు చిప్స్ కూడా తింటారు. ఇది కొందరికి సర్వసాధారణమైన అలవాటు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ ఆహార కలయిక అంత మంచిది కాదు. ఇది శరీరానికి హానికరం కాగలదని హెచ్చరిస్తున్నారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే ఈ అలవాటును మానేయడం మంచిది. ఇలా చల్లని పానీయాలతో చిప్స్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
చల్లని పానీయాలలో చక్కెర అధికంగా ఉంటుంది. కొన్ని డ్రింక్స్‌లో కెఫీన్ కూడా ఉంటుంది. ఇది తాత్కాలికంగా శరీర దాహాన్ని తీర్చినప్పటికీ, వాస్తవానికి శరీరాన్ని నిర్జలీకరణానికి గురి చేస్తుంది. వేసవిలో శరీరానికి అవసరమైన నీటి కొరత వల్ల బలహీనత, తల తిరగడం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో సమస్యలకు కారణమవుతుంది. అంతేకాకుండా చిప్స్‌లో ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో నీటి నష్టాన్ని పెంచి, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అధిక ఉప్పు తీసుకోవడం దాహాన్ని మరింత పెంచుతుంది. దీనివల్ల పదేపదే చల్లని పానీయాలు తాగాల్సి వస్తుంది. ఇది శరీరంలో అసమతుల్యతను పెంచే అవకాశం ఉంది.
ఈ ఆహార కలయికను తరచూ తీసుకుంటే దీర్ఘకాలంలో బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం కూడా పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది ముఖ్యంగా పిల్లలు, యువతకు మరింత ప్రమాదకరం.
శీతల పానీయాలకు బదులుగా సహజ పానీయాలను ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తేమను అందిస్తాయి. చిప్స్‌కు బదులుగా వేయించిన మఖానా, వేరుశెనగలు, పండ్లు తినడం ఆరోగ్యకరమైన ఎంపిక. వేసవిలో శరీరంలోని నీటి స్థాయిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల అనారోగ్యకరమైన ఆహారం తినడం కంటే సమతుల్య ఆహారం తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.