AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: చాణక్య నీతి.. నిజమైన శత్రువులు ఎవరు? ఈ 5 గురితో పెట్టుకుంటే సర్వనాశనమే.. వీరితో జాగ్రత్తగా ఉండండి.!

Chanakya Niti: చాణక్యుడు చెప్పిన అత్యంత లోతైన విషయం ఏంటంటే.. నిజమైన శత్రువు బయట ఎక్కడో లేడు, మీ లోపలే ఉన్నాడు. మీలో ఉండే కోపం, అహంకారం, అత్యాశ, భయం.. ఇవే మీ నిజమైన శత్రువులు. వీటిని గనుక మీరు అదుపులో ఉంచుకోగలిగితే బయట ఉండే ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు.

Chanakya Niti: చాణక్య నీతి.. నిజమైన శత్రువులు ఎవరు? ఈ 5 గురితో పెట్టుకుంటే సర్వనాశనమే.. వీరితో జాగ్రత్తగా ఉండండి.!
Chanakya Niti
Subhash Goud
|

Updated on: May 15, 2026 | 11:33 AM

Share

Chanakya Niti: “నీ శత్రువును గుర్తించు, వారి నుండి నిన్ను నీవు రక్షించుకో, వారిని ఓడించు” అని మీరు చాలాసార్లు వినే ఉంటారు. కానీ, కొందరిని శత్రువులుగా మార్చుకోవడమే మనం చేసే అతిపెద్ద తప్పు అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి వారు మనకు వ్యతిరేకమైతే.. మన మనశ్శాంతి, విజయం, సంతోషం అన్నీ ముక్కలైపోతాయి. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలవబడే ఆచార్య చాణక్యుడు తన జీవిత అనుభవాల ద్వారా.. కొందరు శత్రువులతో తలపడటం అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడమే అని చెప్పారు. చాణక్యుడి ప్రకారం, “శత్రువును ఓడించేవాడు మాత్రమే బుద్ధిమంతుడు కాదు.. ఎవరిని శత్రువుగా మార్చుకోకూడదో తెలిసినవాడే నిజమైన బుద్ధిమంతుడు.” మన చుట్టూనే ఉండే అలాంటి 5 రకాల ప్రమాదకరమైన వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. అసూయపడే వ్యక్తి

వీరు చాలా సాధారణంగా కనిపించే అత్యంత ప్రమాదకరమైన శత్రువులు. వీరు మీ స్నేహితులుగా, బంధువులుగా లేదా తోటి ఉద్యోగులుగా మీ పక్కనే ఉండవచ్చు. మీ విజయాన్ని చూసి పైకి నవ్వుతూ.. లోపల మాత్రం కుళ్లుకుంటూ ఉంటారు. ముఖం ముందర ఏమీ అనకపోయినా, వెనుక మాత్రం మీ ప్రతిష్టను దిగజారుస్తారు. వీరిని శత్రువులుగా మార్చుకుంటే, మీ వెనుక గోతులు తవ్వుతారు. అందుకే వీరి ముందు మీ విజయాలను ఎక్కువగా ప్రదర్శించకండి. వీరితో వాదనలకు దిగకండి. వీరికి ఎప్పుడు కూడా దూరంగా ఉండటం మంచిది.

2. నమ్మకద్రోహి అయిన సొంతమనిషి (కుటుంబంలోనే ఉండే శత్రువు)

ఇది అన్నిటికంటే బాధాకరమైన పరిస్థితి. వీరు మన సొంతవారే అయినప్పటికీ, మన పతనాన్ని కోరుకుంటారు. మీ బలహీనతలన్నీ వీరికి ముందే తెలుసు కాబట్టి, కుటుంబంలో మీ పేరు చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారితో శత్రుత్వం మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది. అందుకే వీరితో కాస్త దూరం పాటించండి. కానీ పైకి మాత్రం సంబంధాలు బాగున్నట్టే నటించండి. మీ రహస్యాలను, భవిష్యత్తు ప్రణాళికలను వీరితో ఎప్పుడు కూడా పంచుకోకండి.

ఇవి కూడా చదవండి

3. ఆలోచించకుండా మాట్లాడే వ్యక్తి (నోటిదురద ఉన్నవారు)

మొహమాటం లేకుండా వాగే ఇటువంటి ‘నోటిదూల’ మనుషులు చాలా ప్రమాదకరం. వీరికి తాము మాట్లాడే మాటల విలువ తెలియదు. ఎక్కడైనా, ఎప్పుడైనా, నోటికి వచ్చింది మాట్లాడేస్తారు. మీ గౌరవాన్ని ఒక్క క్షణంలో మంటగలిపేయగలరు. ఇలాంటి వాడు శత్రువుగా మారితే మీ పరువుకు భంగం కలిగిస్తాడు. అందుకే వీరితో ఎప్పుడూ వాదించకండి. వారి మాటలను అస్సలు పట్టించుకోకండి.

4. ప్రతిదానికి ‘హా’ అనే వ్యక్తి (భజనపరులు/ఐస్‌క్రీమ్ పెట్టేవారు)

వీరు లోపల దాగి ఉండే ఒక రహస్య ప్రమాదం. మీరు ఏం చెప్పినా ‘అవును’ అంటూ తలాడిస్తారు. మీరు తప్పు చేసినా కూడా ‘రైట్’ అంటారు. అలా మిమ్మల్ని మెల్లగా బలహీనపరుస్తారు. వీరు గనుక శత్రువులుగా మారితే, మీ బలహీనతలన్నింటినీ మీకు వ్యతిరేకంగా వాడుకుంటారు. అందుకే వీరి భజన మాటలను గుడ్డిగా నమ్మకండి. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి.

5. అధికారం ఉన్న వ్యక్తి (బాస్ లేదా పవర్‌ఫుల్ వ్యక్తులు)

వీరు అందరికంటే అత్యంత శక్తివంతమైన శత్రువులు. మీ బాస్, ఉన్నతాధికారి లేదా సమాజంలో బాగా ప్రభావం ఉన్న వ్యక్తి కావచ్చు. వీరి దగ్గర డబ్బు, అధికారం, మనుషులు ఉంటారు. చట్టపరంగా లేదా సామాజికంగా మిమ్మల్ని తీవ్రంగా నష్టపరచగలరు. ఇలాంటి వారితో నేరుగా ఢీకొట్టడం అంటే చేజేతులా ఆపదను కొనితెచ్చుకోవడమే. అందుకే వీరితో నేరుగా తలపడకుండా, వ్యూహాత్మకంగా, ఓపికతో వ్యవహరించాలి.

అన్నింటికంటే పెద్ద నిజం: అసలైన శత్రువు మీ లోపలే ఉన్నాడు:

చాణక్యుడు చెప్పిన అత్యంత లోతైన విషయం ఏంటంటే.. నిజమైన శత్రువు బయట ఎక్కడో లేడు, మీ లోపలే ఉన్నాడు. మీలో ఉండే కోపం, అహంకారం, అత్యాశ, భయం.. ఇవే మీ నిజమైన శత్రువులు. వీటిని గనుక మీరు అదుపులో ఉంచుకోగలిగితే బయట ఉండే ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us