నోట్లో నీళ్లూరించే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.. ఇలా చేసి తింటే స్వర్గానికి బెత్తెడే దూరం!

సండే అయినా, మండే అయినా చికెన్, మటన్ లేనప్పుడు బ్యాచిలర్స్ నుండి ఫ్యామిలీస్ దాకా అందరికీ గుర్తొచ్చేది కోడిగుడ్డు. అయితే ఎప్పుడూ ఒకేలాంటి ఎగ్ ఫ్రై లేదా పొరటు తిని బోర్ కొట్టిన వారికి, నోటికి కారంగా, ఘాటుగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఒక అద్భుతమైన వంటకం కోడిగుడ్డు ఎల్లిపాయ కారం. పిల్లల నుండి పెద్దల దాకా లొట్టలేసుకుంటూ తినే ఈ ఘాటైన రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

నోట్లో నీళ్లూరించే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.. ఇలా చేసి తింటే స్వర్గానికి బెత్తెడే దూరం!
Garlic Egg Fry

Updated on: Jul 08, 2026 | 12:15 PM

రెగ్యులర్‌గా చేసుకునే కోడిగుడ్డు పొరటు బోర్ కొడితే, నోటికి కారంగా, ఘాటుగా ఉండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఒకసారి ట్రై చేయండి. వెల్లుల్లి, కారం, జీలకర్ర, ఉప్పు కలిపి కచ్చాపచ్చాగా నూరిన వెల్లుల్లి కారంతో ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఇది వేడి వేడి అన్నం, చపాతీల్లోకి అద్భుతంగా ఉండటమే కాకుండా, లాంగ్ జర్నీల కోసం చేసుకుంటే రెండు రోజుల వరకు అస్సలు పాడైపోదు. తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం..

కోడి గుడ్డు ఎల్లిపాయ కారం తయారీ కోసం కోడిగుడ్లు (5), కారం (2 స్పూన్లు), పెద్ద వెల్లుల్లిపాయ (1), జీలకర్ర (1 స్పూన్), ఉల్లిపాయలు (2 పెద్దవి), ఆయిల్ (5-6 స్పూన్లు), పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మీకు నచ్చిన పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కొత్తిమీర తరుగు.

ఇక ముందుగా వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం, ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని, ఆయిల్ వేసి వేడెక్కాక పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఆపై కొద్దిగా కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఉల్లిపాయలు బాగా వేగాక, వాటిని పాన్ అంచులకు జరిపి, మధ్యలోకి వచ్చే ఆయిల్‌లో ఐదు కోడిగుడ్లను పగలగొట్టి వేయాలి. వీటిని వెంటనే ఉల్లిపాయల్లో కలపకుండా, జస్ట్ ఒకసారి అలా కలిపి మూత పెట్టి సిమ్‌లో రెండు నిమిషాలు ఉడికించాలి. ఒకవైపు ఉడికాక రెండో వైపుకు తిప్పి, మీడియం సైజు ముక్కలుగా కట్ చేస్తూ హై ఫ్లేమ్‌లో డ్రైగా, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి.

ఎగ్ ముక్కలు పూర్తిగా డ్రైగా అయ్యాక, ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి, ముక్కలన్నింటికీ కారం బాగా పట్టేలా మీడియం ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారంలో ఎగ్‌ను సాఫ్ట్‌గా ఉంచకుండా, పూర్తిగా డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేయడం వల్ల ఇది ప్రయాణాల సమయంలో తీసుకెళ్లడానికి చాలా బాగుంటుంది. క్యారేజ్ బాక్స్‌లో పెట్టుకుంటే రెండు రోజులైనా అస్సలు పాడైపోదు.

ఘుమఘుమలాడే ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారాన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే స్వర్గం కనిపించాల్సిందే! చపాతీల్లోకి కూడా ఇది అద్భుతమైన కాంబినేషన్. మీరు కూడా ఈ రోజే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us