
క్రమశిక్షణ లేని జీవితానికి చరమగీతం పాడి, ఫిట్‌నెస్‌ను ఒక యజ్ఞంలా మార్చుకోవాలని ఉందా? అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ‘వెల్‌నెస్ ఛాలెంజెస్’ మీకోసమే. అమెరికన్ ఎంట్రప్రెన్యూర్ ఆండీ ఫ్రిసెల్లా రూపొందించిన ‘75 హార్డ్’ దగ్గర నుండి, ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ‘75 సాఫ్ట్’ వరకు ఈ ట్రెండ్స్ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? శారీరక మార్పుల కంటే మానసిక దృఢత్వానికి ప్రాధాన్యతనిచ్చే ఆ ఛాలెంజ్ ఏంటో చూద్దాం..
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫిట్‌నెస్ వెర్షన్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆండీ ఫ్రిసెల్లా క్రియేట్ చేసిన ‘75 హార్డ్’ ప్రోగ్రామ్ కేవలం వర్కవుట్స్ గురించి మాత్రమే కాదు, అది ఒక మెంటల్ టఫ్‌నెస్ పరీక్ష. ఈ ఛాలెంజ్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. రోజుకు రెండు సార్లు 45 నిమిషాల చొప్పున వర్కవుట్స్ చేయాలి (అందులో ఒకటి కచ్చితంగా బయట చేయాలి), ఆల్కహాల్, చీట్ మీల్స్ లేని కఠినమైన డైట్ పాటించాలి, ప్రతిరోజూ 3.7 లీటర్ల నీరు తాగాలి, నాన్-ఫిక్షన్ పుస్తకం నుంచి 10 పేజీలు చదవాలి, ప్రోగ్రెస్ ఫొటో తీసుకోవాలి. ఏ ఒక్క నిబంధన మిస్ అయినా, మరుసటి రోజు నుంచి మళ్లీ మొదటి రోజూ నుంచి ప్రారంభించాలి.
75 హార్డ్ ఛాలెంజ్ చాలా కఠినంగా ఉండటంతో, బిగినర్స్ కోసం దీని ‘సాఫ్ట్ వెర్షన్’ ఇప్పుడు పాపులర్ అవుతోంది. ఇందులో ఒకే ఒక 45 నిమిషాల వర్కవుట్, 3 లీటర్ల నీరు, హెల్తీ డైట్, 10 పేజీల పఠనం ఉంటాయి. ఆల్కహాల్‌కు ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపు ఉండటంతో, ఇది సామాన్యులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంది. దీనితో పాటు, 21 రోజుల పాటు ఫిర్యాదులు చేయకుండా, అనవసర విషయాలకు దూరంగా ఉండే ‘21-డే హాబిట్ ఛాలెంజ్’ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోందని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో ఈ ట్రెండ్స్ ఊపందుకోవడానికి ముఖ్య కారణం సెలబ్రిటీలే. బాలీవుడ్ నటి అలయా ఎఫ్ ఈ ఛాలెంజ్‌ను రెండుసార్లు పూర్తి చేసి ట్రెండ్‌ను సెట్ చేసింది. అలాగే మందిరా బేడీ, నేహా ధూపియా వంటి ఫిట్‌నెస్ ప్రియులు దీనిని అనుసరిస్తూ తమ ప్రోగ్రెస్ అప్‌డేట్స్ ఇచ్చారు. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంకిత్ బైయన్‌పురియా ఈ ఛాలెంజ్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి, లక్షలాది మంది యువతను ప్రభావితం చేశాడు.
ఈ ఛాలెంజెస్ కేవలం బరువు తగ్గడం కోసం కాదు, మనిషిలోని క్రమశిక్షణను, పట్టుదలను పరీక్షించుకోవడానికి. 75 రోజుల పాటు ఒకే నియమావళిని పాటిస్తే, అది అలవాటుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ పనినైనా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేసే తత్వాన్ని ఈ ఛాలెంజెస్ నేర్పిస్తాయి. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈ ఛాలెంజ్ చేసినా, చేయకపోయినా.. మన జీవనశైలిలో సానుకూల మార్పులను తీసుకురావడమే వీటి అంతిమ లక్ష్యం. సో, మీరు కూడా మీలోని క్రమశిక్షణను పరీక్షించుకోవాలనుకుంటే, రేపే ఒక చిన్న ఛాలెంజ్ ప్రారంభించండి!