ఫుల్లుగా ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు.. గ్లాస్ తాగితే ఒంట్లో వేడిని తగ్గించి పేగులను క్లీన్ చేస్తుంది..
బార్లీ నీటిలో ఫైబర్, బీటా గ్లూకాన్, బి విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు తోడ్పడటంతోపాటు కొలెస్ట్రాల్ నియంత్రణ, గుండె ఆరోగ్యానికి మేలు చేయవచ్చు. ఇంట్లోనే బార్లీ వాటర్‌ను ఎలా తయారు చేసుకోవాలి? నిమ్మరసం, సబ్జా గింజలతో రుచికరంగా ఎలా తాగాలి? ప్రయోజనాలు, తయారీ విధానం తెలుసుకోండి.

బార్లీలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి.. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, వివిధ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి బార్లీ నీరు ఒక అద్భుతమైన సహజ పానీయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బార్లీలో ఫైబర్, బీటా-గ్లూకాన్, బి-విటమిన్లు, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ శక్తివంతమైన పానీయం తయారీ విధానం, దాని ప్రయోజనాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. బార్లీ వాటర్ కేవలం ఖర్చు తక్కువ పానీయం మాత్రమే కాదు, దీనిలో ఉండే ప్రయోజనాలు లెక్కకు మించినవి..
బార్లీ నీరు ప్రయోజనాలు:
బార్లీ నీరు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:
శరీర ఉష్ణోగ్రత నియంత్రణ: బార్లీ నీరు సహజ సిద్ధంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, ఉపశమనాన్ని అందిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుదల: దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. మలబద్ధకాన్ని నివారిస్తుంది.. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
రోగనిరోధక శక్తి పెంపు: బార్లీలో ఉండే విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచి, అంటువ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి.
కొలెస్ట్రాల్ నియంత్రణ: బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ: మధుమేహ వ్యాధిగ్రస్తులకు బార్లీ నీరు చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడం: బార్లీలో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది.
విష నిర్మూలన (Detoxification): బార్లీ నీరు మూత్రవిసర్జనను పెంచి, శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపుతుంది. కిడ్నీలు. కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
బార్లీ నీటి తయారీ విధానం:
ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని తయారుచేయడం చాలా సులభం:
నానబెట్టడం: ముందుగా, పావు కప్పు బార్లీ గింజలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తరువాత, ఒక కప్పు నీటిలో రాత్రంతా లేదా కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. బార్లీ గింజలు కిరాణా షాపులు లేదా సూపర్ మార్కెట్లలో సులభంగా దొరుకుతాయి. నానబెట్టిన తర్వాత, బార్లీ గింజల నుండి నీటిని వడకట్టి పారబోయాలి. నానబెట్టిన నీటిని ఉపయోగించకూడదు, ఎందుకంటే అది జీర్ణ సమస్యలను కలిగించవచ్చు.
ఒక గిన్నెలో మూడు కప్పుల నీటిని తీసుకొని హై ఫ్లేమ్‌లో మరగనివ్వాలి. నీరు మరిగేటప్పుడు, నానబెట్టిన బార్లీ గింజలను అందులో వేయాలి.
తక్కువ మంటపై ఉడికించడం: బార్లీ గింజలు వేసిన తర్వాత నీరు మరగడం ప్రారంభమైనప్పుడు, మంటను మీడియం ఫ్లేమ్‌కు తగ్గించి, 15 నిమిషాల పాటు మరిగించాలి. ఈ సమయంలో బార్లీ గింజలు మెత్తబడి, వాటిలోని పోషకాలు నీటిలోకి చేరతాయి. 15 నిమిషాల తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, ఒక స్ట్రైనర్ సహాయంతో బార్లీ నీటిని ఒక గిన్నెలోకి వడకట్టాలి.
వడకట్టిన బార్లీ గింజలను పారవేయకుండా సలాడ్‌లు, కిచిడీలు, ఉప్మాలు లేదా చపాతీ పిండిలో కలుపుకోవచ్చు.
ఈ బార్లీ నీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, రెండు మూడు టేబుల్ స్పూన్ల నానబెట్టిన సబ్జా గింజలు, ఒక నిమ్మకాయ రసం, ఒకటి లేదా రెండు టీ స్పూన్ల తేనెను కలుపుకోవాలి. సబ్జా గింజలు కూడా శరీరానికి చలువ చేస్తాయి.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తాగవచ్చు. రోజంతా ఎప్పుడైనా తీసుకోవచ్చు, అయితే ఒకటి లేదా రెండు గ్లాసులు మాత్రమే తాగడం మంచిది.
అంతేకాకుండా.. బార్లీ గింజలను పౌడర్ చేసుకుని.. నీటిలో కలిపి.. మరిగించి తాగవచ్చు..
బార్లీ వాటర్ మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
