Why Everyone Loves Ice Cream: ఐస్ క్రీం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వర్షాకాలం , చలికాలం, వేసవి అనే తేడా లేకుండా పిల్లలు, పెద్దలు లొట్టలేసుకు తినేస్తారు. ఐస్ క్రీం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దుష్ర్పభావాలు కూడా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. ఐతే రకరకాల రుచుల్లో, ఆకర్షణీయ రంగుల్లో కనిపించే ఐస్‌క్రీం పాలతో తయారు చేస్తారు కాబట్టి వీటిల్లో చాలా పోషకాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం..
ఐస్ క్రీంలలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఐస్‌క్రీంను ఇన్‌స్టంట్ ఎనర్జీ బూస్టర్‌గా పిలుస్తారు. అలసిపోయినప్పుడు లేదా కాస్త నీరసంగా అనిపించినప్పుడు ఐస్ క్రీం తింటేచాలు వెంటనే శక్తి పెరుగుతుంది. నిజానికి పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ విధమైన ఆహారాలు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కాల్షియం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. త్వరగా అలసట చెందకుండా ఉండేందుకు కాల్షియం అవసరం. శరీరంలో 99% కాల్షియం ఎముకలు వినియోగించుకుంటాయి. కాబట్టి పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మీ శరీరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
ఐస్ క్రీంలలో ప్రొటీన్ల కంటెంటె కూడా అధికంగానే ఉంటుంది. చర్మంతోపాటు ఎముకలు, నరాలు, రక్తం వంటి శరీరంలోని వివిధ భాగాలకు ప్రోటీన్లు మేలు చేస్తాయి. ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల కణజాలం, కండరాలు బలపడతాయి. గోర్లు, జుట్టు వంటి శరీరంలోని కొన్ని భాగాలకు కూడా ప్రోటీన్ అవసరమే. అంతేకాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ మూడ్ సరిగ్గాలేకుంటే వెంటనే ఓ ఐస్ క్రీం తింటే సరి.. మామూలు స్థితికి వచ్చేస్తారు.
ఐస్ క్రీం వల్ల కొన్ని దుష్ర్ఫభావాలు కూడా ఉన్నాయి. వీటిల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఐస్ క్రీంలను ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు.. వెన్న, చాక్లెట్‌తో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లో కేలరీలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి హానికరం. ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల తలనొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంటే మితంగా తింటేనే ఇది ఔషధం అన్నమాట.