
వేసవి పోయింది.. వర్షాకాలం వచ్చేసింది. వానాలతో వాతావరణం చల్లబడి ఆహ్లాదంగా ఉంటుంది.. కానీ, ఇప్పుడే చాలా ఇళ్లలో అసలు సమస్య మొదలవుతుంది. గోడలు తేమగా మారడం (సీలేజ్), ప్లాస్టర్ ఊడిపోవడం, బూజు పట్టడం సర్వసాధారణం. ఇది ఇంటి అందాన్ని పాడు చేయడమే కాకుండా శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని సులువైన చిట్కాలు ఉన్నాయి.
వైట్ వెనిగర్ (తెల్ల సిరకా) మ్యాజిక్: గోడలపై బూజు లేదా నల్లటి మచ్చలు ఏర్పడితే వైట్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఒక స్ప్రే బాటిల్‌లో వెనిగర్ తీసుకుని, తేమ లేదా బూజు ఉన్న గోడ భాగాలపై నేరుగా స్ప్రే చేయాలి. దీనిని అరగంట పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఒక పాత బ్రష్ లేదా స్క్రబ్బర్‌తో తేలికగా రుద్ది, పొడి గుడ్డతో తుడిచేయాలి. వెనిగర్‌లోని యాసిడ్ గుణాలు బూజును పూర్తిగా నశింపజేస్తాయి.
బేకింగ్ సోడా చిట్కా: గోడలలోని తేమను గుంజేయడానికి, దుర్వాసనను పోగొట్టడానికి బేకింగ్ సోడా ఉత్తమమైనది. కొద్దిగా బేకింగ్ సోడాలో నీరు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ పేస్ట్‌ను తేమగా ఉన్న గోడలపై పూయాలి. అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఇది గోడలపై ఉన్న తేమను పీల్చేసుకుని గోడను పొడిగా ఉంచుతుంది.
వాటర్ ప్రూఫింగ్, లీకేజ్ తనిఖీ: గోడలు తేమగా మారడానికి ప్రధాన కారణం పైకప్పు (టెర్రస్) లేదా పైపుల నుండి నీరు లీక్ అవ్వడమే. వర్షాలు పడటానికి ముందే ఇంటి పైకప్పుపై ఎక్కడైనా పగుళ్లు ఉంటే వాటిని వాటర్ ప్రూఫింగ్ పుట్టీ లేదా సిమెంట్‌తో పూడ్చేయాలి. లోపలి గోడలకు వాటర్ ప్రూఫ్ పెయింట్స్ వేయడం వల్ల కూడా తేమ రాకుండా ఉంటుంది.
వెంటిలేషన్ (గాలి వెలుతురు) ముఖ్యం: ఇంట్లో గాలి సరిగ్గా ఆడకపోతే తేమ శాతం (Humidity) పెరిగి గోడలు త్వరగా పాడవుతాయి. వర్షం లేని సమయంలో ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి, తద్వారా తాజా గాలి, వెలుతురు లోపలికి వచ్చి గోడలు త్వరగా ఎండిపోతాయి. వంటగది, బాత్‌రూమ్‌లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లను వాడటం వల్ల తేమ పేరుకుపోకుండా ఉంటుంది.
ఈ చిన్న జాగ్రత్తలు, చిట్కాలను పాటించడం ద్వారా మీ ఇంటి గోడలను సీలేజ్ సమస్య నుండి కాపాడుకుని, ఇంటిని అందంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..