గుడ్డుతో జుట్టు సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసా..?

జుట్టు ఆరోగ్యం బాగుండాలంటే బయట దొరికే వాటితో పాటు ఇంట్లో తయారు చేసుకునే సహజ చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా గుడ్లలో ఉండే పోషకాలు జుట్టుకు చాలా విధాలుగా మేలు చేస్తాయి. ప్రోటీన్, బయోటిన్, విటమిన్ B12 లాంటి ముఖ్యమైన పోషకాలు గుడ్లలో ఎక్కువగా ఉండటం వల్ల అవి జుట్టును బలంగా, రాలకుండా, మెరిసేలా ఉంచుతాయి.

గుడ్డుతో జుట్టు సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసా..?
Healthy Hair Tips

Updated on: Jun 28, 2025 | 2:26 PM

జుట్టు ముఖ్యంగా ప్రోటీన్‌ తో తయారై ఉంటుంది. గుడ్లు సహజ ప్రోటీన్ మూలం కావడంతో అవి జుట్టు పెరుగుదలకు, బలంగా తయారవడానికి ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదు బయోటిన్ లాంటి పోషకాల వల్ల జుట్టు తక్కువగా ఊడుతుంది, తేలికగా తెగదు. కాబట్టి గుడ్లను బయట నుంచి ప్యాక్‌ ల రూపంలో వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా, అందంగా మారుతుంది.

అలోవెరా, ఎగ్, ఆలివ్ ఆయిల్

మీ జుట్టుకు బలాన్ని తేమను ఇచ్చే అద్భుతమైన ప్యాక్ ఇది. రెండు గుడ్ల తెల్లసొనలు తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి మిశ్రమం తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. తేలికపాటి హెర్బల్ షాంపూ వాడటమే మంచిది.

ఎగ్, పాలు, బాదం పాలు, కొబ్బరి నూనె

జుట్టుకు తేమను అందించి బలహీనపడిన కుదుళ్లను తిరిగి శక్తివంతం చేసే ప్యాక్ ఇది. ఒక గుడ్డు తెల్లసొన, ఒక్కో టీస్పూన్ బాదం పాలు, సాదా పాలు, కొబ్బరి నూనెను కలిపి మెత్తగా చేయాలి. తలకు అప్లై చేసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. వారానికి రెండు సార్లు వాడితే మంచి మార్పు కనిపిస్తుంది.

పెరుగు, నిమ్మరసం, ఎగ్

ఈ మిశ్రమం చుండ్రు సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఒక గుడ్డు తెల్లసొన, నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేయాలి. గంట పాటు అలాగే ఉంచిన తర్వాత సున్నితమైన షాంపూతో కడిగేయాలి. ఇది జుట్టుకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు. మంచి షైనింగ్ కూడా ఇస్తుంది.

(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే తలకు వాడాలి)