
ప్రపంచాన్ని భయపెడుతోన్న సమస్యల్లో ప్లాస్టిక్ ప్రధానమైంది. ప్లాస్టిక్ భూతం కారణంగా కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యాయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఒక లీటర్ వాటర్ బాటిల్‌లో ఏకంగా 2,40,000 ప్లాస్టిక్ కణాలు ఉంటాయని అధ్యయనంలో తేలింది.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రోసీడింగ్స్ జర్నల్‌లో ఈ విషయాలను ప్రచురించారు. వాటర్ బాటిల్‌లో గతంలో అంచనా వేసిన దానికంటే 100 రెట్లు ఎక్కు ప్లాస్టిక్ కణాలు ఉండొచ్చని పరిశోధనల్లో తేలింది. ఇంతకు ముందు చేసిన అధ్యయనాలు 1 నుంచి 500 మైక్రోమీటర్ల మధ్య ఉన్న ప్లాస్టిక్ కణాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అందుకే గతంలో వాటర్ బాటిల్‌లో తక్కువ ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. నానో ప్లాస్టిక్ కణాలు మానవ ఆరోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగిస్తాయి. అవి మానవ కణాలలోకి చొచ్చుకుపోయేంత చిన్నగా ఉంటాయి.
ఈ ప్లాస్టిక్ కణాలు రక్తంలోకి ప్రవేశించి.. అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతాయి. నానోప్లాస్టిక్ కణాలు పుట్టబోయే పిల్లల్లోకి కూడా చేరుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు చాలా కాలంగా బాటిల్ వాటర్‌లో వాటి ఉనికిని అనుమానిస్తున్నారు, అయితే వ్యక్తిగత నానోపార్టికల్స్‌ను గుర్తించే సాంకేతికత ఇప్పటి వరకు అందుబాటులో లేదు. ఈ సవాలును అధిగమించడానికి.. తాజాగా మైక్రోస్కోపీ టెక్నిక్‌ను కనుగొన్నారు. డేటా-ఆధారిత అల్గారిథమ్‌ను ప్రోగ్రామ్ చేశారు. అమెరికాలోని మూడు ప్రసిద్ధ బ్రాండ్‌లకు చెందిన వాటర్ బాటిల్స్‌ను పరిగణలోకి తీసుకొని ఈ పరిశోధన జరపగా.. ప్రతి లీటరులో 110,000 నుంచి 370,000 చిన్న ప్లాస్టిక్ కణాలను కనుగొన్నారు, వాటిలో 90% నానోప్లాస్టిక్ కణాలే కావడం గమనార్హం.
నానో ప్లాస్టిక్‌లను విశ్లేషించడంలో ఉన్న సవాళ్లను అధిగమించడంలో ఈ అధ్యయనం ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యయనంలో పాల్గొన్న కొలంబియా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నైక్సిన్ కియాన్ చెప్పారు. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏటా 450 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతోంది. ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా భూమిపై ఉన్న ప్రతిచోటా ఉన్నప్పటికీ.. వాటర్ బాటిల్ కారణంగా మానవ శరీరంపై ఎక్కువ ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి..