93 ఏళ్ల వయసులో ‘ఐరన్ మ్యాన్’! గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన తాతయ్య.. ఫిట్‌నెస్ రహస్యం ఇదే!

వయసు పెరిగే కొద్దీ మనిషిలో ఉత్సాహం, బలం తగ్గుతూ ఉంటుందని, విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమమని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ, ఒక తాతయ్య వయసు ఉన్న వ్యక్తి జిమ్‌లో భారీ బరువులు ఎత్తుతూ, యువకులకు సవాలు విసురుతూ ఉంటే ఎలా ఉంటుంది?

93 ఏళ్ల వయసులో ‘ఐరన్ మ్యాన్’! గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన తాతయ్య.. ఫిట్‌నెస్ రహస్యం ఇదే!
Jim Arrington1.jpg

Updated on: Feb 26, 2026 | 8:37 PM

93 ఏళ్ల వయసులో కూడా తన కండలను ప్రదర్శిస్తూ, ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్న ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. కాలంతో పోటీ పడుతూ తన శరీరాన్ని ఒక అద్భుతంలా మార్చుకున్న ఆ బాడీ బిల్డర్ సక్సెస్ సీక్రెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

చాలామంది 60 ఏళ్లు దాటగానే శారీరక శ్రమను తగ్గించేస్తారు. కానీ కాలిఫోర్నియాకు చెందిన ఒక ముసలాయన మాత్రం 93 ఏళ్ల వయసులో అద్దం ముందు నిలబడి తన బైసెప్స్ చూసుకుంటూ మురిసిపోతుంటారు. కేవలం సరదా కోసం మాత్రమే కాదు, పోటీ ప్రపంచంలో అత్యంత వృద్ధ బాడీ బిల్డర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న ఘనత ఆయనది. పుట్టుకతోనే అనారోగ్య సమస్యలతో చిన్న శరీరాకృతితో ఉన్న ఆ బాలుడు, వృద్ధాప్యంలో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే స్థాయికి ఎలా ఎదిగారు? ఆయన మృత్యువును కూడా ధీటుగా ఎదుర్కొనేలా చేసిన ఆ డైట్ ప్లాన్ ఏంటి?

జిమ్ అరింగ్టన్ అభిప్రాయం ప్రకారం, ఫిట్‌నెస్ యుద్ధం జిమ్ కంటే ముందే వంటగదిలో మొదలవుతుంది. దశాబ్దాల పాటు ఆయన పాత పద్ధతిలో ఎక్కువ పాలు, బీఫ్ తీసుకునేవారు. బాడీ బిల్డింగ్ అంటే అదే సరైన ఆహారం అని నమ్మేవారు. కానీ, 90 ఏళ్లలోకి ప్రవేశించిన తర్వాత తన శరీరం ఆ ఆహారాన్ని స్వీకరించలేకపోతుందని ఆయన గుర్తించారు. జంతు సంబంధిత ప్రోటీన్లు శరీరంలో మంట, కీళ్ల నొప్పులకు కారణమవుతున్నాయని తెలుసుకున్న జిమ్, తన డైట్ ను పూర్తిగా మార్చేశారు.

బీఫ్ నుండి పుట్టగొడుగుల వరకు..

జిమ్ తన పాత ఆహారపు అలవాట్లను వదిలివేసి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ వైపు మొగ్గు చూపారు. పాలు, మాంసానికి బదులుగా ఆలివ్ ఆయిల్, పుట్టగొడుగులు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకున్నారు. “నాకు ఆ ఆహారాలంటే అలర్జీ లేదు, కానీ అవి నా వయసులో సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. అందుకే డైట్ మార్చాను, ఫలితంగా 93 ఏళ్లలో కూడా నేను శిక్షణ కొనసాగించగలుగుతున్నాను” అని ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వీడియోలో పేర్కొన్నారు.

జిమ్ కేవలం బరువులు ఎత్తడం మాత్రమే కాదు, ’10-10-10′ అనే వినూత్న పద్ధతిని పాటిస్తారు. మొదట 10 సార్లు బరువులు ఎత్తడం, ఆపై 10 సెకన్ల పాటు బరువును అలాగే పట్టుకుని కండరాన్ని బిగబట్టడం, మళ్ళీ 10 సార్లు వ్యాయామం చేయడం ఆయన ప్రత్యేకత. వారానికి మూడు రోజులు, రోజుకు రెండు గంటల పాటు ఆయన జిమ్‌లో గడుపుతారు. ఇది వినడానికి సులభంగా ఉన్నా, 93 ఏళ్ల వయసులో అంతటి ఏకాగ్రత చూపడం అసాధారణం.

“బాడీ బిల్డింగ్ అంటే అనుకూలత. జీవితంలో ఒక సమయంలో పనిచేసిన పద్ధతి, తర్వాత కాలంలో పనిచేయకపోవచ్చు” అని జిమ్ అరింగ్టన్ చెబుతారు. మారుతున్న వయసుతో పాటు శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ, ఆహారం మరియు వ్యాయామంలో మార్పులు చేసుకుంటే వృద్ధాప్యం కూడా విలాసంగా మారుతుందని ఆయన నిరూపిస్తున్నారు.

Follow Us