కుప్పంలో చంద్రబాబుకు పొగ: వైసీపీ యాక్షన్ ప్లాన్

|

Feb 05, 2020 | 4:01 PM

సుదీర్ఘ కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఆయనకు చెక్ పెట్టేందుకు వైసీపీ సిద్దమవుతోంది. ఈ టాస్క్‌ని జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్నప్పడు ఆ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై మంత్రి పెద్దిరెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతిని […]

కుప్పంలో చంద్రబాబుకు పొగ: వైసీపీ యాక్షన్ ప్లాన్
Follow us on

సుదీర్ఘ కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఆయనకు చెక్ పెట్టేందుకు వైసీపీ సిద్దమవుతోంది. ఈ టాస్క్‌ని జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం.

కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్నప్పడు ఆ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై మంత్రి పెద్దిరెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతిని బయట పెట్టడమే టార్గెట్‌గా కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఉపాధి హామీ పథకంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై రామకుప్పం మండలంలో సామాజిక తనిఖీలకు తెరలేపారు మంత్రి. మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన సోషల్ ఆడిట్‌లో 8 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో కోటి 40 లక్షల రూపాయలు దుర్వనియోగం జరిగిందంటూ ఆ మొత్తం రికవరీకి ఆదేశాలు జారీ చేశారు.

నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అయిదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఉపాధి పనులు చేసిందంతా టిడిపి మద్దతుదారులే కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు హయాంలో జరిగిన పనులన్నింటిలోనూ అవినీతి సొమ్మును కక్కిస్తామమని కుప్పం వైసిపినేతలు ప్రతిఙ్ఞలు చేస్తున్నారు. ఇప్పటికే ఎకో టూరిజం పనుల్లో 4 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ పనులు నిలిపి వేసింది ప్రభుత్వం. వాటికి చెల్లించాల్సిన బిల్లులను కూడా నిలిపి వేశారు.

గతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేసిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంజూరు చేసిన 100 కోట్ల రూపాయల సిసి రోడ్డు పనులు, నీరు చెట్టు కింద చేపట్టిన పనులపైనా విచారణ జరిపిస్తున్నారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ కావడంతో విచారణకు మరింత ప్రాధాన్యత ఏర్పడుతోంది.

అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ క్యాడర్‌ను ఇరుకున పెట్టేందుకే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని టిడిపి నేతలంటున్నారు. వైసిపి కుట్రలకు బెదిరేది
లేదని, చిన్నపాటి వ్యవహారాలతో చంద్రబాబుకు చెక్ పెట్టాలనుకుంటే అవి పగటి కలలేనని కామెంట్ చేస్తున్నారు టిడిపి నేతలు.