కొల్లేరు సరస్సు… ప్రకృతి ప్రసాదించిన మరో ప్రపంచం. భువిలో కొలువైన మరో భూతల స్వర్గం. అక్కడి ప్రతిదృశ్యం ఓ కావ్యం. అయితే.. ఇదంతా ఒక్కప్పటి మాట.. వేలాది రకాల జీవజాతులకు ఆలవాలమైన కృష్ణా జిల్లాలోని ఈ అద్భుత జీవావరణం ప్రస్తుతం కాలుష్య కాసారంగా మారుతోంది.
ప్రకృతి అందాలతో, అలసిన మనసులకు ఆహ్లాదాన్ని అందించే విదేశీ పక్షుల కిలకిలరావాలతో కళకళలాడే కొల్లేరు సరస్సు కరిగిపోతోంది. భవిష్యత్తులో కానరానంటూ కన్నీరు పెడుతోంది. ఖండాంతరాలు దాటి వొచ్చే విదేశీ అతిథులతో సందడి సందడిగా ఉండే కొల్లేరు సరస్సు ఇప్పుడు ఎడారిలా.. బురద నేలలా దర్శనమిస్తోంది. జనజీవితాలతో ముడిపడిన కొల్లేరు ఇప్పుడు తన ఉనికినే క్రమంగా కోల్పోతోంది. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కనిపించబోనంటూ హెచ్చరిస్తోంది.
ఒకప్పుడు దోసిళ్లతో కొల్లేటి నీటిని తాగేవారు. అదే అమృతమని భావించేవారు. కానీ ఇప్పుడు ఆ నీరే విషతుల్యమని భయపడుతున్నారు. అక్వాతోపాటు స్థానిక పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నీరు ఇలా అన్నీ కలసి కొల్లేటిని కాలుష్య సరస్సుగా మార్చేస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరుగాంచిన కొల్లేరు నేడు అంతరించిపోతోంది. ఒకప్పుడు పవిత్రతకు మారుపేరైన సరస్సు.. ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతోంది. ఆ నీటిలో వేలు ముంచినా వ్యాధులు వస్తాయనే భయం ప్రజల్లో కలుగుతోంది. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు అంతరించిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. సరికొత్త ప్రభుత్వమైనా దీనిపై శ్రద్ధ వహిస్తుందనే ఆశ ప్రజల్లో కలుగుతోంది.