మొట్టమొదటిసారిగా కరడు గట్టిన ఉగ్రవాదిని పట్టుకునేందుకు అమెరికా నడుం బిగించింది. భారత ప్రభుత్వం చేయలేని పనికి తానే శ్రీకారం చుట్టింది. 2008 నవంబరు 26 న ముంబైలో జరిగిన భారీ పేలుళ్లకు సూత్రధారి అయిన పాక్ లష్కరే తోయిబా సభ్యుడు సాజిద్ మిర్ ని పట్టుకునేందుకు సాయపడే సమాచారం అందించినవారికి 50 లక్షల డాలర్ల భారీ రివార్డు అందజేస్తామని ప్రకటించింది. నాటి ఘోర దురంతంలో ఇతని పాత్ర ఎంతో ఉందని యుఎస్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ సంస్థ పేర్కొంది. వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో మిర్ పేరు మొదటి స్థానంలో ఉంది. ఏ దేశంలో ఇతడు ఉన్నా ఇతని అరెస్టుకు సహాయపడే కీలక సమాచారం అందజేస్తే చాలు, ఈ అత్యధిక రివార్డు వారికే సొంతమవుతుందని ఈ సంస్థ వెల్లడించింది.
2008 నవంబరు 26 న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ముంబైలోని పలు హోటళ్లు, ప్రదేశాలను టార్గెట్లుగా చేసుకుని ధ్వంస రచనకు పూనుకొంది. ఈ నగరంలోని తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియో పోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, చత్రపతి శివాజీ టర్మినస్ వంటి పలు చోట్ల జరిగిన పేలుళ్లలో 166 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఆ ఘటనలో 9 మంది టెర్రరిస్టులు కూడా మృతి చెందగా సజీవంగా పట్టుబడిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను 2012 నవంబరు 11 న పూణే లోని ఎరవాడ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు.సాజిద్ మిర్ ను అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు 2011 ఏప్రిల్ 11 న దోషిగా ప్రకటించింది. ఉగ్రవాదులకు అన్ని విధాలా సాయపడ్డాడని, ఓ దేశంలో భారీ ప్రాణ, ఆస్థి నష్టానికి కారకుడయ్యాడని పేర్కొంది.