వలసకూలీలకు శ్రామిక్ రైళ్లను నడపాలి: కేంద్రమంత్రి ధర్మేంద్ర

వలస కార్మికులు పని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా వసతుల లేక నానావస్థలు పడుతున్నారు. దీంతో కేంద్ర మంత్రి వలస కార్మికుల తరలింపు ప్రత్యేక రైళ్లను నడపాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.

వలసకూలీలకు శ్రామిక్ రైళ్లను నడపాలి: కేంద్రమంత్రి ధర్మేంద్ర

Updated on: Sep 08, 2020 | 5:19 PM

కరోనా పుణ్యామాని వలస కార్మికులు కష్టాలు వర్ణనాతీతం. ఉన్న ఉపాధి కోల్పోయి పూట గడవడమే కష్టంగా మారింది. మాయాదారి రోగానికి భయపడి కన్న ఊరును వెతుక్కుంటూ వస్తే.. కుటుంబ పోషణనే భారంగా మారింది. మళ్లీ పని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా వసతుల లేక నానావస్థలు పడుతున్నారు. దీంతో కేంద్ర మంత్రి వలస కార్మికుల తరలింపు ప్రత్యేక రైళ్లను నడపాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.

వలస కార్మికులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తిరిగి వెళ్ళేందుకు శ్రామిక్ రైళ్లను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ఆయన రాసిన లేఖలో ఒడిశా నుంచి వలస కూలీలు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళేందుకు శ్రామిక్ రైళ్ళను తిరిగి ప్రారంభించాలని లేఖలో కోరారు. వలస కూలీలకు జీవనోపాధి అత్యవసరమని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఒడిశాలో వలస కూలీలు దయనీయ స్థితిలో ఉన్నట్లు తెలిపిన ఆయన.. వారికి జీవనోపాధి అవసరమన్నారు. వలస కూలీలు తమకు ఉపాధి దొరికే ప్రాంతాలకు వెళ్ళడానికి వీలుగా ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు శ్రామిక్ స్పెషల్ రైళ్ళను పునరుద్ధరించాలని, ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రి లేఖలో పేర్కొన్నారు.

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చిక్కుపోయిన వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కేంద్రం. ఇందులో భాగంగా శ్రామిక్ రైళ్ళను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా లక్షలాది మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరవేర్చింది. ప్రస్తుతం అన్‌లాక్ అమలవుతున్నందువల్ల స్వస్థలాల నుంచి ఉపాధి కోసం తిరిగి వెళ్లేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. చేతిలో చిల్లుగవ్వ కూడలేని వారికి శ్రామిక్ రైళ్లను నడపి వారిని ఆదుకోవాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు.