దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో జమ్మికుంటకు స్థానం.. తొలి పది పీఎస్‌ల జాబితా ప్రకటించిన కేంద్రం

| Edited By: Pardhasaradhi Peri

Dec 03, 2020 | 2:28 PM

దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితా ప్రకటించింది కేంద్ర హోంశాఖ. కేంద్రం విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌కు అరుదైన గుర్తింపు లభించింది.

దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో జమ్మికుంటకు స్థానం.. తొలి పది పీఎస్‌ల జాబితా ప్రకటించిన కేంద్రం
Follow us on

దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితా ప్రకటించింది కేంద్ర హోంశాఖ. కేంద్రం విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌కు అరుదైన గుర్తింపు లభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 16,671 పోలీస్‌ స్టేషన్లలో అగ్రస్థానంలో నిలిచిన 10 ఉత్తమ పోలీస్‌ స్టేషషన్ల జాబితాను గురువారం కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. వాటిలో కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌ 10వ స్థానం దక్కించుకుంది. కాగా మణిపూర్ రాష్ట్రానికి చెందిన తౌబల్ పోలీస్ స్టేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో పోలీస్‌ స్టేషన్ల పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా తొలి పది స్థానాల్లో నిలిచిన పోలీసుస్టేషన్ల జాబితానను ప్రకటిస్తుంది కేంద్ర హోం శాఖ

తొలి పది స్థానాల్లో నిలిచిన పోలీసు స్టేషన్ల జాబితాః

1.తౌబల్ – మణిపూర్
2. సురమంగళం -సేలం నగరం, తమిళనాడు
3. ఖర్సంగ్ – చాంగ్లాంగ్, అరుణాచల్ ప్రదేశ్
4.ఝల్‌మిలి – సూరజ్‌పూర్, ఛత్తీస్‌‌గఢ్
5. సాంఘ్వమ్, దక్షిణ గోవా, గోవా
6. కాలిఘట్ – అండమాన్ & నికోబార్ దీవులు
7. పాక్యాంగ్ – తూర్పు జిల్లా, సిక్కిం
8. కాంత్ – మొరాదాబాద్, యుపి
9. కాన్‌వెల్ – దాద్రా & నగర్ హవేలి,
10. జమ్మికుంట – కరీంనగర్ జిల్లా, తెలంగాణ

2015లో గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన డీజీపీల సదస్సులో పోలీసు స్టేషన్ల పనితీరు గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. డేటా విశ్లేషణ, నేరుగా పనితీరు పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కేంద్ర హోం శాఖ పోలీసు స్టేషన్లకు ర్యాంకులను కేటాయిస్తూ వస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఉత్తమంగా పనిచేసిన పోలీస్ స్టేషన్ల షార్ట్‌ లిస్టుతో కేంద్రం ర్యాంకింగ్‌ ప్రక్రియ చేపట్టింది. ఆస్తులకు సంబంధించిన నేరాలు, మహిళలపై నేరాలు, బలహీనవర్గాలపై నేరాలు, తప్పిపోయిన వ్యక్తులు, గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన కేసులను కేంద్ర హోంశాఖ పరిగణనలోకి తీసుకుంటుంది. వీటి ఆధారంగా కేసుల పరిష్కరణతో పాటు శాంతి భద్రతలను సంబంధించిన అంశాలను కూడా పరిశీలించి ఉత్తమ పీఎస్‌లను ఎంపిక చేస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి750కి పై పోలీస్‌ స్టేషన్లను గుర్తించి వాటిలో ఒకటి లేదా రెండు పోలీస్ స్టేషన్లను అధికారులు ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి జమ్మికుంట పోలీసు స్టేషన్ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

జమ్మికుంట పోలీసులు నిత్య జనగణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు జనగణ కార్యక్రమ నిర్వహిస్తుంది. ఈ పోలీసుల స్టేషన్ లో కేసుల పురోగతి అద్బుతంగా ఉంది. ఉత్తమ పోలీసుస్టేషన్‌గా ఎంపిక కావడంపట్ల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి జమ్మికుంట పోలీసు స్టేషన్ సందర్శించారు.