తోటి కోడళ్ల మధ్య చిన్న,చిన్న గొడవలు ఉండటం సహజం. అవి కాస్త పెద్దవైతే కుటుంబ పెద్దలు కలగజేసుకోని చక్కదిద్దుతారు. అయితే చిత్తూరు జిల్లాలోని ఈ తోటి కోడళ్ల గొడవ మాత్రం రెండు రాష్ట్రాలలోని గ్రామాలకు విస్తరించింది. అది కూడా ఇరు గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్ సమీపంలో పంచాయితీ పేరుతో పోట్లాటకు దిగారు. ఈ ఘర్షణలో పలువురురికి గాయాలయ్యాయి. గొడవ జరగకుండా నిరోధించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.
వివరాల్లోకి వెళ్తే..ఏపీలోని చిత్తూరు జిల్లా యాదమరి మండలం పచ్చయప్పవూరుకు చెందిన పరమేశ్వరి, హేమలత తోటి కోడళ్లు. వీరి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. పొలం కూడా పక్కపక్కనే. ఈ క్రమంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అవి కాస్తా పెద్దవి కావడంతో ఇరువురి తల్లిదండ్రులు కలగజేసుకున్నారు. తోటి కోడళ్ల స్వగ్రామాలైన..తమిళనాడు రాష్ట్రంలోని అంకణాపల్లి, పూతలపట్టు మండలం చిన్నబండపల్లి గ్రామాల్లోని.. వారి తరఫు బంధువులు వచ్చారు. శుక్రవారం సాయంత్రం యాదమ పీఎస్ వద్ద పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి అదుపు తప్పిన ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి కూతవేటు దూరంలో ఉన్న పోలీసులు..అక్కడికి వచ్చి ప్రేక్షక పాత్ర పోషించారు. అనంతరం గాయాలైన వారిని చికిత్స కోసం చిత్తూరు గవర్నమెంట్ ఆస్పత్రికి పంపారు. ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి.
Also Read : రమేష్ ఆస్పత్రికి భారీ షాకిచ్చిన ఏపీ సర్కార్