యూఎస్ ‘లో కేసులు’ పెరిగిన నేపథ్యం, కరోనా వైరస్ పై ట్రంప్ సలహాదారు స్కాట్ అట్లాస్ రాజీనామా

| Edited By: Anil kumar poka

Dec 01, 2020 | 1:12 PM

అమెరికాలో వైరస్ కేసులు పెరిగిన నేపథ్యంలో  ఈ  ఇన్ఫెక్షన్ పై అధ్యక్షుడు ట్రంప్ కు సలహాదారైన స్కాట్ అట్లాస్ రాజీనామా చేశారు. మాస్కులు ధరించకూడదని, లాక్ డౌన్ వంటి చర్యల వల్ల ఫలితం లేదని, ఇలా సలహాలిస్తూ వివాదాస్పదుడైన ఈయన చివరకు పదవి నుంచి తప్పుకున్నారు.

యూఎస్ లో కేసులు పెరిగిన నేపథ్యం, కరోనా వైరస్ పై ట్రంప్ సలహాదారు స్కాట్ అట్లాస్ రాజీనామా
Follow us on

అమెరికాలో వైరస్ కేసులు పెరిగిన నేపథ్యంలో  ఈ  ఇన్ఫెక్షన్ పై అధ్యక్షుడు ట్రంప్ కు సలహాదారైన స్కాట్ అట్లాస్ రాజీనామా చేశారు. మాస్కులు ధరించకూడదని, లాక్ డౌన్ వంటి చర్యల వల్ల ఫలితం లేదని, ఇలా సలహాలిస్తూ వివాదాస్పదుడైన ఈయన చివరకు పదవి నుంచి తప్పుకున్నారు. కోవిడ్ 19 వంటి వ్యాధుల అదుపు విషయంలోను, ప్రజారోగ్యంపైనా తగినంత అనుభవం లేని ఈయన రాజీనామా పెద్దగా  ఆశ్చర్యం కలిగించలేదని ఫాక్స్ న్యూస్ తెలిపింది. పైగా ఈ వారంలో అధ్యక్షునితో ఈయనకు గల కాంట్రాక్ట్ కూడా ముగియనుంది. అమెరికా ప్రెసిడెంట్ కి స్పెషల్ అడ్వైజర్ నైన తను రాజీనామా చేస్తున్నట్టు స్కాట్ అట్లాస్ తెలిపారు. ట్రంప్ కి ఓవైపు కృతజ్ఞతలు తెలియజేస్తూ…..మరోవైపు అధ్యక్షుడు కానున్న జో బైడెన్ కి ఈయన ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు.

ఈ పాండమిక్ లో లక్షలాది అమెరికన్లను రక్షించాలన్న ఒకే ఒక ధ్యేయంతో పని చేశానని, లేటెస్ట్ సైన్స్ ను, ఆధారాలను తాను ప్రాతిపదికగా తీసుకున్నానని స్కాట్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కులు ఉపకరిస్తాయని శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పటికీ.. అసలు ఇవి పని చేస్తాయా అని ఈ మహాశయుడు గత అక్టోబరులో ట్వీట్ చేశారు. (అయితే ఇది తప్పుడు సమాచారం అంటూ ట్విటర్ దీన్ని తొలగించింది). అమెరికాలో కరోనా వైరస్ పెద్దగా లేదని, దీనిపై ఆందోళన అనవసరమని కూడా అట్లాస్ ఓ రష్యన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా నివారణకు దోహదపడే లాక్ డౌన్ వంటి చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఈయనగారు గత నవంబరులో మిషిగాన్ ప్రజలను కోరడం విడ్డూరం. బహుశా స్కాట్ సలహాలను బట్టే డొనాల్డ్ ట్రంప్ కూడా మొదట్లో మాస్కులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా దేశంలో కరోనా ప్రభావం పెద్దగా లేదని కూడా ఆయన పదేపదే చెబుతూ వచ్చారు. మాస్కుల వల్ల ఎంతో ప్రయోజనం ఉందని వైట్ హౌస్ లో కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు, అంటువ్యాధుల నివారణా నిపుణుడు ఫోసీ చేసిన సూచనలను, సలహాలను ట్రంప్ పెడచెవిన పెట్టారు. ఎన్నో సందర్భాల్లో ఆయనను విమర్శించారు.

తాజాగా అమెరికాలో 13,522,247 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 267,844 మంది కరోనా రోగులు మృతి చెందారు. ప్రపంచంలోనే ఇది అత్యంత దారుణమైన కరోనా వైరస్ పరిస్థితి అన్న విమర్శలను అమెరికా మూటగట్టుకుంది.