పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామస్తుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెం ఆర్.డి.ఓ కార్యాలయం దగ్గర రెడ్డిగూడెం గ్రామస్తులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆదివాసీ సంక్షేమ రాష్ట్ర పరిషత్ అధ్యక్షుడు కాకి మధుని పోలీసులు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి నేతలు మాట్లాడుతూ… పశ్చిమ ఏజెన్సీలో నెత్తురు పారడానికి ఐటీడీఏ పీవో కేర్ పురం బాధ్యత వహించాలన్నారు. తాతల కాలం నుంచి ఆదివాసీలు పొడి చేసుకుని ఆ భూములు చేసుకుంటున్నారని, అధికారులే గిరిజనేతరులకు కొమ్ము కాస్తూ గిరిజనులపై దాడికి పంపిస్తున్నారని ఆరోపించారు. మొన్న జరిగిన సంఘటనలో గాయపడిన గిరిజనులను పరామర్శించడానికి వెళ్లిన ఆదివాసీ నాయకుడు మధు ని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేదిలేదన్నారు.