
దొంగతనం చేయడమంటే మాటలు కాదు. చాలా నేర్పరితనం ఉండాలి. అయితే దొంగతనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఎప్పుడూ నిండు చేతులతో రాలేరు. ఒక్కోసారి వారికి ఒక్క వస్తువు కూడా దొరకదు. ఇలానే ఇటీవల చోరికి వెళ్లిన ఓ దొంగకు డబ్బు, విలువ చేసే వస్తువులు కనిపించలేదు. దీంతో చాలా బాధపడ్డ ఆ దొంగ.. ఓ లేఖను రాసి వెళ్లాడు. అందరికీ నవ్వు తెప్పిస్తున్న ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కడలూరు జిల్లాలోని మందారకుప్పంలో జయరాజ్ అనే వ్యక్తి దుకాణం నడుపుతున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ షాపుపై ఓ దొంగ కన్ను పడింది. ఎలాగైనా అక్కడ కన్నం వేసి దోచుకోవాలని భావించాడు. దీంతో గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణంలోకి దూరాడు. డబ్బు పెట్టే క్యాష్ కౌంటర్‌తో పాటు షాప్ మొత్తం వెతికాడు. అయినా చిల్లిగవ్వ కూడా దొరకలేదు. దీంతో నిరాశకు గురైన ఆ దొంగ ఓ ఉత్తరాన్ని రాసి వెళ్లాడు.
‘‘‘ప్రాణాన్ని పణంగా పెట్టి కష్టపడి దొంగతనానికి వచ్చా. క్యాష్ కౌంటర్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టకపోవడం మీకేమైనా భావ్యమా..? దుకాణంలో ఉన్న పప్పు దినుసులు పట్టుకెళ్లి నేనేం చేయాలి..? చిర్రెత్తుకొచ్చి ఈ ఉత్తరం రాస్తున్నా’’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. కాగా శుక్రవారం ఉదయాన్నే దుకాణం తెరిచిన జయరాజ్‌కు తన షాప్‌లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉండటం గమనించి.. దొంగతనం జరిగి ఉంటుందని భావించాడు. ఆ తరువాత వస్తువులేం మాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అతడు ఉత్తరం చూసి షాక్ అయ్యాడు. ఇక విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చేతి రాత ఆధారంగా వారు దొంగను గుర్తించే పనిలో పడ్డాడు.