ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మూన్నేళ్లకే యువతి ఆత్మహత్య..

|

Aug 21, 2020 | 1:56 PM

మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.. ఒకరినొకరు విడిచి ఉండలేమని వాగ్థానం చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మూడు నెలలు తీరక ముందే వారి కాపురంలో చిచ్చురేగింది. అంతలోనే ఆ యువతికి నూరేళ్లు నిండిపోయాయి.

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మూన్నేళ్లకే యువతి ఆత్మహత్య..
Follow us on

మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.. ఒకరినొకరు విడిచి ఉండలేమని వాగ్థానం చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మూడు నెలలు తీరక ముందే వారి కాపురంలో చిచ్చురేగింది. అంతలోనే ఆ యువతికి నూరేళ్లు నిండిపోయాయి.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని రెడ్డిపాలెంకు చెందిన రైతు కూలి పోసిన నరసింహారావు, అంకమ్మలకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె విజయలక్ష్మి(19) గుడ్లవల్లేరులో గతేడాది పాలిటెక్నిక్‌ పూర్తి చేసింది. ఆ సమయంలో బంటుమిల్లి మండలం బర్రిపాడుకు చెందిన జోగి సూర్యప్రకాశ్‌ పెడన నుంచి గుడ్లవల్లేరుకు ఆటో నడిపేవాడు. ఆమె అతడి ఆటో ఎక్కి గుడ్లవల్లేరు కళాశాలకు వచ్చేది. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం తెలిసిన విజయలక్ష్మి తల్లితండ్రులు పెళ్లికి నిరాకరించారు. చివరాఖరికి తల్లిదండ్రులను ఒప్పించి సూర్యప్రకాశ్‌తో మూడు నెలల కిందట వివాహం చేసుకుంది విజయలక్ష్మి.

పెళ్లి సమయంలో కట్నకానుకలు ఏమీ వద్దని బుద్ధి మంతుడి మాటలు చెప్పిన సూర్యప్రకాశ్ వివాహం అయ్యాక అసలు రూపాన్ని బయటపెట్టాడు. కట్నం కావాలని, ట్రాక్టర్‌ కొనివ్వాలంటూ వేధింపులకు గురి చేయడంతో విజయలక్ష్మి రెండు పర్యాయాలు పుట్టింటికి వచ్చింది. తండ్రి కుమార్తెకు సర్దిచెప్పి అత్తింట దిగబెట్టి వచ్చారు. కాస్త సమయం తీసుకుని కట్నకానుకలు అందిస్తానని వారికి నచ్చజెప్పారు. రెండు రోజులుగా వేధింపులు ఎక్కువ కావడంతో విజయలక్ష్మి పుట్టింటికి వచ్చేసింది.

ఇదిలావుండగా, గురువారం తల్లి, తండ్రి, చెల్లి పొలం పనులకు వెళ్లారు. తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేసరికి విజయలక్ష్మి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పామర్రు పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే, భర్త, అత్తింటి వారు కట్నం కోసం వేధించడంతో తన కుమార్తె చనిపోయిందని తండ్రి నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.