అమర్‌నాథ్ యాత్రికులకు వర్షం ఆటంకంగా మారింది. ఎత్తయిన కొండలు గుట్టలమధ్య సుధీర్ఘంగా సాగిపోతున్న భక్తులపై వరుణదేవుడు కరుణించలేదు. ఇరుకైన బాట మార్గంలో భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు.హిమాలయ పర్వతాల్లో దాదాపు 14 వేల అడుగుల ఎత్తులోని గుహలో సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోడానికి ఎంతో మంది భక్తులు ఈ యాత్రకు సిద్ధపడతారు. ఏడాదిలో 45 రోజుల మాత్రమే ఉండే మంచు లింగాన్ని చూసేందుకు ఎగబడతారు. ఇప్పటివరకు గత ఆరు రోజుల్లో 81,630 మంది యాత్రికులు హిమ లింగాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నతెలుగు భక్తుల సంఖ్య రెండుకు చేరింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భాగ్యమ్మ అనే మహిళ, కన్నుమూశారు. పులివెందులకు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందారు. ఆయన సుమారు 60 మందితో కలిసి జూన్ 28న తీర్థయాత్రలకు బయలుదేరారు. ఈ విధంగా అమర్‌నాథ్ యాత్రలో కన్నుమూయడం విషాదాన్ని మిగిల్చింది.