
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి హైకోర్టుకు స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచదర్‌రావు వాదనలు వినిపించారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వార్డుల విభజన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశామని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ తన వాదన వినిపిస్తూ ప్రభుత్వం చెబుతున్న వాదనలు పూర్తిగా అవాస్తవమని, ఇప్పటివరకు ఓటర్ల జాబితా, వార్డుల విభజన సక్రమంగా జరగలేదని తెలిపారు. మరోవైపు 75 మున్సిపాలీటీలకు స్టే విధించిందని తెలిపారు. ఇదిలా ఉంటే స్టే విధించిన వాటిని వదిలిపెట్టి మిగిలిన మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికలసంఘం హై కోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసును విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేయడంతో ఇవాళ మరోసారి విచారణ కొనసాగనుంది.