ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. మోదీ.. తెలంగాణ రాష్ట్రంపై చిన్న చూపు చూస్తున్నారని.. పలు రాజకీయ కారణాలతో తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రావడం లేదన్నారు. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని.. అయితే.. మోదీ మాత్రం నాగ్‌పూర్ వైపే అభివృద్ధి చేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో కొత్త పారిశ్రామిక పాలసీ వచ్చి ఇవాళ్టికి ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా.. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో.. కేటీఆర్ సహా పలువురు ప్రత్యేక కార్యక్రమం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో.. మంత్రి కేటీఆర్‌తో పాటు మల్లా రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ రకమైన కామెంట్స్ చేశారు. టీఎస్ ఐపాస్ పాలసీ కింద పలు పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని.. ఈ ఐదేళ్లలో.. 11,609 పరిశ్రమలు దీని ద్వారా అనుమతులు పొందాయన్నారు కేటీఆర్. దాదాపు లక్షా డభ్బై మూడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయని.. వీటిల్లో ఇప్పటికే.. 8,964 పరిశ్రమలు మొదలయ్యాయని తెలిపారు కేటీఆర్.