బీజేపీలో చేరతానంటూ నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించడాన్ని మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి మీద ఉందని మల్లు రవి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేగా తెలంగాణలో కాంగ్రెస్ ని బలోపేతం చేయడం, రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను ఓడించడం అతని నైతిక బాధ్యత అని రవి వ్యాఖ్యానించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారితో నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. రాబోయే ఎన్నికలలో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మల్లు రవి జోస్యం చెప్పారు. ఇలా ఉండగా, జనవరి 1వతేదీన తిరుమలలో శ్రీనివాసుని దర్శనం అనంతరం తాను బీజేపీలో చేరబోతున్నానని కోమటి రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.