ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో దూకుడు పెంచుతోంది తెలుగుదేశం పార్టీ. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించిన జగన్.. అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని ఘాటుగా విమర్శలు గుప్పించారు ఉమ. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
7 శాతం పూర్తైన పోలవరం పనులను గత టిడిపి ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసిందని చెప్పారాయన. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని, జగన్ అసమర్థత, చేతకానితనం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోయాయని ఉమ అంటున్నారు. గోదావరిలో లాంచీ మునిగిపోతే ధర్మాడి సత్యం బయటకు తీసాడని, మునగబోయే జగన్ ప్రభుత్వాన్ని కాపాడటానికి ఏ ధర్మాడి సత్యం లేడని ఉమా ఎద్దేవా చేశారు. ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లను, నిర్మాణ సంస్థలను మారిస్తే పోలవరం భద్రతకు బాధ్యులెవరిన దేవినేని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం 5200 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ నిధులను తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ అయిదు నెలల కాలంలో కేంద్రం నుంచి ఎందుకు తీసుకురాలేదని అడిగారు దేవినేని ఉమ. వైఎస్ కుటుంబ బంధువు పీటర్ చేత పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందని చెప్పించారని, చంద్రబాబుతోపాటు తనపై బురద జల్లాలని తప్పుడు రిపోర్టు ఇచ్చారని ఉమ ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన పోలవరం పనులపై కేంద్రం ఆడిట్ లెక్కలు అడుగుతోందని అన్నారాయన.