
Tamilrockers Website Blocked: తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్… పైరసీ సినిమాలకు ఇదొక కేంద్ర బిందువు. గత కొన్నేళ్లుగా తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ భాషల్లోనే కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో విడుదలైన సినిమాల పైరేటెడ్ వెర్షన్స్ అన్నింటిని ఈ తమిళ్ రాకర్స్ తమ సైట్‌లో అప్‌లోడ్ చేసుకుంటూ వచ్చింది . ఈ వెబ్‌సైట్ వల్ల కోలీవుడ్ ఇండస్ట్రీ భారీగా నష్టాలు చవి చూసిందని చెప్పాలి. ఎంతోమంది సాంకేతిక నిపుణుల శ్రమను.. నిర్మాతల డబ్బుతో చెలగాటం ఆడుతూ వచ్చిన ఈ వెబ్‌సైట్ పూర్తిగా మూసివేయబడినట్లు తెలుస్తోంది.
డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం ప్రకారం తాజాగా అమెజాన్ ఇంటర్నేషనల్ తమిళ్ రాకర్స్‌కు వ్యతిరేకంగా పలు కంప్లయింట్స్ దాఖలు చేసింది. దీనితో ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్(ICANN) రిజిస్ట్రీ ద్వారా ఆ సైట్‌ను తొలగించారట. అంతేకాదు నిన్నటి నుంచి ట్విట్టర్‌లో తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్ షట్ డౌన్‌కు సంబంధించిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం త్వరలోనే మళ్లీ సైట్ కొత్త డొమైన్ ద్వారా అందుబాటులోకి వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.