Sourav Ganguly Health Updates: బీసీసీఐ చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం మరోసారి అస్వస్థతకు గురై కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో వైద్యులు గంగూలీకి గురువారం మరోసారి యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గంగూలీకి ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో తాజాగా రెండు స్టెంట్‌లు అమర్చినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ‘కరోనరీ ఆర్టినరీ పూడికలను తొలగించేందుకు గంగూలీకి అదనంగా రెండు స్టెంట్‌లు అమర్చినట్లు వైద్యులు తెలిపారు.ఆయన్ను 24గంటలపాటు పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
48 ఏళ్ల వయసున్న గంగూలీ ఈ నెలలో రెండు సార్లు ఆసుపత్రి పాలయ్యారు. జనవరి 2న స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్‌ను అమర్చారు. ఆ తర్వాత జనవరి 7వ తేదీన వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి ఛాతీలో నొప్పి రావడంతో ఆయనకు మరో రెండు స్టెంట్‌లు అమర్చినట్లు తెలిపారు.