షోయబ్‌ అక్తర్‌కు‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవి..!

| Edited By: Balaraju Goud

Sep 11, 2020 | 12:55 PM

తలతిక్క నిర్ణయాలతో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టును భ్రష్టు పట్టించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు తత్వం బోధపడింది.. పీసీబీని నాశనం చేశారంటూ మొన్నీమధ్యనే సీనియర్‌ మేటి ఆటగాడు జావెద్‌ మియాందాద్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..

షోయబ్‌ అక్తర్‌కు‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవి..!
Follow us on

తలతిక్క నిర్ణయాలతో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టును భ్రష్టు పట్టించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు తత్వం బోధపడింది.. పీసీబీని నాశనం చేశారంటూ మొన్నీమధ్యనే సీనియర్‌ మేటి ఆటగాడు జావెద్‌ మియాందాద్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. పైగా ఇందుకు కారకుడు ప్రధాని ఇమ్రాన్‌ఖానేనని నిందలేసిన సంగతి కూడా తెలిసిందే! ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు పీసీబీ ఏదో ఒకటి చేస్తే తప్ప క్రికెట్‌ ఫ్యాన్స్‌ సంతృప్తి చెందేలా లేరు.. అందుకే పీసీబీలో రెండు పదవుల్లో కొనసాగుతున్న మాజీ క్రికెటర్‌ మిస్బావుల్‌ హక్‌ను చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి తప్పించాలనుకుంటోంది.. పాక్‌ క్రికెట్‌ టీమ్‌కు ప్రధాన కోచ్‌ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్న మిస్బాకు ఒక్క పదవి చాలనుకుంటోంది పీసీబీ. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ పెద్దగా పొడిచిందేమీ లేదు.. దీనికి మిస్బాను బాధ్యుడిని చేస్తూ అతడిని చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి తప్పించి హెడ్‌ కోచ్‌గా మాత్రమే కొనసాగించాలని అనుకుంటోంది పీసీబీ.

మిస్బా ప్లేస్‌లో షోయబ్‌ అక్తర్‌ను తీసుకురావాలన్నది పీసీబీ ప్లాన్‌..షోయబ్‌ అక్తర్‌ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు.. పాక్‌ క్రికెట్‌ బోర్డుతో చర్చలు జరిగిన మాట నిజమేనన్నాడు.. అయితే తనకు ఏ పదవి ఇస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదన్నాడు అక్తర్‌. ప్రస్తుతం తాను ఏ చీకూచింతా లేకుండా హాయిగా ఉన్నానని, బాగానే సెటల్‌ అయ్యయాని చెప్పుకొచ్చిన షోయబ్‌ అక్తర్‌.. పీసీబీకి సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు. ఛాన్స్‌ వస్తే పాక్‌ క్రికెట్‌ను ప్రక్షాళన చేయడానికైనా రెడీగా ఉన్నానని తెలిపాడు. పాక్‌ క్రికెట్‌ బోర్డుతో ఇంకా మాటా ముచ్చట పూర్తి కాలేదని, వీలైనంత తొందరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అక్తర్‌ వివరించాడు. క్రికెట్‌లో యంగ్‌స్టర్స్‌కు అవకాశం ఇవ్వాలన్నాడు. గెలుపోటములను పట్టించుకోకుండా దూకుడుతో కూడిన క్రికెట్‌ ఆడాలన్నది తన అభిప్రాయమని షోయబ్‌ అక్తర్‌ వివరించాడు. పాక్‌ క్రికెట్‌కు పునర్వైభవం రావాలంటే ముందుగా క్రికెటర్ల మైండ్‌సెట్‌ మారాలన్నాడు. ఒకప్పుడు జావెద్‌ మియాందాద్‌ అయినా, వసీం అక్రమ్‌ అయినా మైదానంలో దూకుడు కనబర్చేవారని, ఆ విధంగానే పాక్‌కు చిరస్మరణీయమైన విజయాలను అందించారని అక్తర్‌ అన్నాడు.