ఉత్తరాఖండ్ లోని ద్రోణగిరి కొండలలో సంజీవని మూలిక మాదిరిగానే ఒక మూలికను కనుగొన్నట్లు ఉత్తరాఖండ్ అటవీ శాఖ పరిశోధనా విభాగం అధికారులు పేర్కొన్నారు. రామాయణం నుండి వచ్చిన సంజీవని మొక్క అద్భుతమైన వైద్య లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు. ఉత్తరాఖండ్ ఆయుష్ విభాగం మాజీ డైరెక్టర్ ఆయుర్వేద అభ్యాసకుడు మయారామ్ యునియాల్ మాట్లాడుతూ.. ”పిథోరాగఢ్ జిల్లాలోని జౌల్జీవి ప్రాంతంలో లభించే ఈ మొక్క యొక్క లక్షణాలను నిర్ధారించడానికి దాని నమూనాలను లక్నోలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపించామని తెలిపారు. ఈ మూలికను కనిపెట్టడానికి 2016 లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
రామాయణం ప్రకారం.. రావణుడి పెద్ద కుమారుడు మేఘనాథునితో పోరాడుతున్న సమయంలో లక్ష్మణుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు సోదరుని ప్రాణాలను కాపాడటానికి హిమాలయాల నుండి సంజీవని మూలికను తీసుకురావాలని హనుమంతుడిని కోరాడు. హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న సుమేరు పర్వతానికి వెళ్ళి అక్కడ సంజీవని మొక్కను గుర్తుపట్టక మొత్తం సుమేరు పర్వతాన్ని ఎత్తుకొస్తాడు. లక్ష్మణుడికి ఆ మొక్క రసాన్ని పోయగా స్పృహనుంచి లేస్తాడు. ఆయుర్వేద నిపుణులు ఈ అభివృద్ధి పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ మొక్కకు మనిషిని బ్రతికించే గుణం ఉందని చాలామంది నమ్ముతారు.